ఇకపై అమ్మాయిలను వేధిస్తే సంఘ బహిష్కరణే.. వారి కోసం స్పెషల్ టీమ్స్: మంత్రి సీతక్క కీలక ప్రకటన

by Ramesh Naini |

బాలికల రక్షణ కోసం బాలికలతో స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు.

ఇకపై అమ్మాయిలను వేధిస్తే సంఘ బహిష్కరణే.. వారి కోసం స్పెషల్ టీమ్స్: మంత్రి సీతక్క కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బాలికల రక్షణ కోసం బాలికలతో (sneha Committees) స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క (Seethakka) కీలక ప్రకటన చేశారు. స్వీయ రక్షణ టీములుగా స్నేహ కమిటీలు పనిచేస్తాయని తెలిపారు. రెండు రోజుల పాటు జరుగుతున్న మేధోమథన సదస్సు ముగింపు సభలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని మాట్లాడారు. మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నో కొత్త ఆలోచనలకు ఈ సదస్సు ప్రాణం పోసిందన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో ఒక అడ్వైజరీ కమిటీ నియమిస్తామని తెలిపారు. బాలికల రక్షణ కోసం బాలికలతో స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తామని కీలక అంగన్వాడీ టీచర్ల ద్వారా అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన కల్పిస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళా బాలికల భద్రత మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థలను గుర్తించి అంగన్వాడీలను వారితో అనుసంధానం చేస్తామన్నారు.

ఆకాశాన్ని చీల్చుకొని అమ్మాయిలు అంతరిక్షానికి వెళ్లినా భూమి మీద కొన్నిసార్లు రక్షణ కరువు అవుతుందన్నారు. అందుకే అమ్మాయిల స్వీయ రక్షణ కోసం బాలికా రక్షక టీములను ఏర్పాటు చేస్తామన్నారు. అమ్మాయిలను వేధిస్తే సంఘ బహిష్కరణకు గురవుతారని, అమ్మాయిలను ముట్టుకుంటే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. అమ్మాయిల పట్ల చెడుగా ప్రవర్తిస్తే ఇలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో అబ్బాయిలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మహిళల హక్కుల మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించి మహిళా భద్రత కోసం ప్రతిష్ట విధానాలను రూపొందిస్తామన్నారు. చాలా చోట్ల ముళ్ళ పొదల్లో, చెత్తకుప్పల్లో అప్పుడే పుట్టిన బిడ్డలను వదిలేసి వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చీమలు, కుక్కలు, చెత్త, ముండ్ల మధ్య శిశువుల ప్రాణాలు పోతున్నాయని, దీన్ని నివారించేందుకు వీలున్న చోట ఊయలలను ఏర్పాటు చేస్తామన్నారు. పుట్టిన బిడ్డలను పారేయకుండా.. ఏర్పాటు చేసిన ఊయలలో వదిలేస్తే వారి బాధ్యతను మేమే స్వీకరిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటై పదేళ్లైనా ఇప్పటికీ బాల్య వివాహ నిరోధక చట్ట రూల్స్‌ను అడాప్ట్ చేసుకోకపోవడం బాధాకరమన్నారు. త్వరలో రూల్స్‌ను అడాప్ట్ చేసుకుంటామని, బాల్యవివాహాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామసభల్లో, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో బాల్య వివాహల వల్ల జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఐసీడీఎస్ పథకాలకు తెలంగాణ ప్రాంతంలోనే బీజం పడిందన్నారు. 1972లో మహబూబ్‌నగర్‌లో ఫ్రీడమ్ ఫైటర్ దుర్గాబాయి దేశ్ ముఖ్ ఐసీడీఎస్ ప్రారంభించారని, ఆ అనుభవాల ఆధారంగానే దేశవ్యాప్తంగా ఇందిరా గాంధీ ఐసీడీఎస్ స్కీంను విస్తరింపజేశారని వివరించారు. వారి ఆదర్శంగా అంగన్వాడీ సేవలను ప్రతి ఇంటికి చేర్చాలని, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించి ఇస్తామన్నారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసి స్థలాలను గుర్తించాలన్నారు. అంగన్వాడి గదుల్లోని దేశ భవిష్యత్తు ఉందని, కాబట్టి దేశ భవిష్యత్తును లిఖించేది అంగన్వాడీ సిబ్బందని కొనియాడారు. కరీంనగర్‌లో ప్రతి శుక్రవారం అంగన్వాడి సిబ్బంది గ్రామస్తులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని, అదేవిధంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని అధికారులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల అడ్మిషన్లను హాజరును పెంచాలని అన్నారు.

Next Story