TG: పెన్షన్ల ఫైలుపై సంతకం చేసిన మంత్రి సీతక్క

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-30 17:20:44  IST  )

హెచ్‌ఐవీ బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ సర్కారు మరోసారి మానవీయంగా స్పందించింది.

TG: పెన్షన్ల ఫైలుపై సంతకం చేసిన మంత్రి సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్‌ఐవీ బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ సర్కారు మరోసారి మానవీయంగా స్పందించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం 14,084 మంది కొత్త హెచ్​ఐవీ బాధితులకు చేయూత పెన్షన్లు మంజూరు చేస్తూ ఫైల్‌పై సంతకం చేశారు. ఈ పెన్షన్లు జూలై నెల నుంచి లబ్ధిదారులు అందుకోనున్నారు. హెచ్​ఐవీ బాధితులు పూర్తి స్థాయిలో ప‌ని చేయలేని స్థితిలో ఉండటంతో పాటు, వారిపై నెలనెలా అధిక వైద్య ఖర్చులు కూడా పడుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పేదరికంతో బాధపడుతున్న హెచ్​ఐవీ బాధితుల జీవిత నాణ్యతను మెరుగుపరిచేందుకు చేయూత పథకం కింద ఈ సాయం అందించనున్నారు.

ఇప్పటికే 34,421 మందికి నెలకు రూ.2016 చొప్పున పెన్షన్ అందుతోంది. ఇందుకోసం రాష్ట్రం నెలవారీగా రూ.6.93 కోట్లు ఖర్చు చేస్తోంది. 2022 ఆగస్టు తరువాత హెచ్​ఐవీ కేటగిరీలో కొత్తగా పెన్షన్లు మంజూరవ్వలేదు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీజీఎస్ఏసీఎస్) ఆధ్వర్యంలో కొత్తగా నమోదు అయిన 14,084 మందికి అర్హతలు నిర్ధారించిన అనంతరం సెర్ప్​ద్వారా పెన్షన్లు మంజూరు అయ్యాయి.

జిల్లాల వారీగా అర్హుల సంఖ్య..

హైదరాబాద్ – 3,019, నల్గొండ – 1,388, ఖమ్మం – 954, సూర్యాపేట – 931, కరీంనగర్ – 833, ఆదిలాబాద్ -482, భ‌ద్రాద్రి కొత్త‌గూడేం- 556, హ‌న్మ‌కొండ -825, జ‌గిత్యాల- 306, జ‌న‌గాం- 228, కామారెడ్డి -702, మ‌హ‌బూబ్ న‌గ‌ర్- 452, నిజామాబాద్- 528, పెద్ద ప‌ల్లి -567, సంగారెడ్డి -1242, సిద్దిపేట -527, వికారాబాద్- 544. అయితే జయశంకర్ భూపాలపల్లి, గద్వాల్, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో కొత్తగా ఒక్కరు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

ఈ నూతన లబ్ధిదారులకు ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వ్యయం రూ.28.40 కోట్లు కాగా, కావాల్సిన నిధులు ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే 4020 మంది డ‌యాల‌సిస్ పేషెంట్లకు ఇటీవలే పించ‌న్ మంజూరు చేయ‌గా..తాజాగా హెచ్​ఐవీ బాధితులకు పించ‌న్ మంజూరు చేయ‌డంతో హెచ్​ఐవీ బాధిత వ‌ర్గాలు ప్రభుత్వానికి కృత‌జ్ఞత‌లు తెలిపాయి.

Next Story