- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breakfast scheme: బ్రేక్ ఫాస్ట్ స్కీంను ప్రారంభిస్తాం.. అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష
తెలంగాణను పోషక లోప రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేక పోషకాహార కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణను పోషక లోప రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేక పోషకాహార కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ స్కీంను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం మధురానగర్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖపై జిల్లా డీడబ్ల్యూఓలతో మంత్రి సీతక్క సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీజీ ఫుడ్స్ చైర్మన్ ఫహీం, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, టీజీ ఫుడ్స్ ఎండి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులు, చేసిన ఖర్చులు, అమలవుతున్న పథకాలు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయబోయే పథకాలు, అంగన్వాడి భవనాల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్య సరఫరా, అంగన్వాడీ కేంద్రాలకు హాజరు శాతం, ప్రీస్కూల్ యాక్టివిటీ, మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
అంగన్వాడీ భవనాల నిర్మాణం..
ఈ సందర్భంగా మంత్రి సీతక్క అంగన్వాడీ భవనాల నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. 2199 అంగన్వాడీ భవనాలు మంజూరు చేస్తే ఇప్పటివరకు కేవలం 500 భవనాలే పూర్తయ్యాయని.. మిగిలిన భవనాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభించిన నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా లోపం లేదా నిర్లక్ష్యం జరిగినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సాక్ష్యం అంగన్వాడీ కింద రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం, ప్రీస్కూల్ విద్య, పరిశుభ్రమైన, సానుకూల వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద అంగన్వాడి చిన్నారులకు రోజుకు 100 ఎంఎల్ విజయ పాలు సరఫరా చేస్తున్నామని చెప్పారు. కౌమార బాలికల్లో రక్తహీనత తగ్గించేందుకు ఆదివాసీలు అధికంగా ఉన్న మూడు జిల్లాల్లో పల్లి, చిరుధాన్యాల చిక్కిలను అందిస్తున్నామని తెలిపారు. ఈ రెండు కార్యక్రమాలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అంశంపై సమగ్ర నివేదికను అధికారులు సమర్పించాలని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాలు లేనిచోట, మొబైల్ అంగన్వాడి సేవలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా :
మిషన్ వాత్సల్య కింద బాలల రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, మిషన్ శక్తి ద్వారా మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. అమ్మాయిల భద్రత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. జిల్లాల వారీగా ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతున్నాయని, వాటి వేగాన్ని మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. మహిళల గౌరవం, పిల్లల ఆరోగ్యం, భద్రత, విద్యపై ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. తెలంగాణను మహిళలు, పిల్లల సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.






