భారీ వర్షాల ఎఫెక్ట్.. దెబ్బతిన్న 580 అంగన్వాడీ భవనాలు.. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు

by Ramesh Naini |   (  Updated:2025-08-29 10:35:16  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా అంగన్వాడీ కేంద్రాలకు నష్టం జరిగింది.

భారీ వర్షాల ఎఫెక్ట్.. దెబ్బతిన్న 580 అంగన్వాడీ భవనాలు.. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన (Heavy rains) భారీ వర్షాల కారణంగా అంగన్వాడీ కేంద్రాలకు నష్టం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Seethakka) ఆదేశాల మేరకు అధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేసి సీఎస్ ద్వారా శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించారు. సొంత భవనాల్లో నడుస్తున్న 440 అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi centers), రెంట్ ఫ్రీ భవనాల్లో నడుస్తున్న మరో 140 కేంద్రాలు కలిపి మొత్తం 580 భవనాలు వర్షాల ప్రభావంతో దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. పైకప్పుల లీకేజీలు, గోడలు, బేస్‌మెంట్‌లో పగుళ్లు, ఫ్లోర్ దెబ్బతినడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపించాయని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం – 75, నిర్మల్ – 100కు పైగా, కామారెడ్డి – 49, గద్వాల్ – 40, హనుమకొండ – 25, మెదక్ – 25, వనపర్తి – 22, ఆసిఫాబాద్ – 20, ములుగు – 20 జిల్లాల్లో అంగన్వాడి భవనాలకి ఎక్కువగా నష్టం వాటిల్లిందని తేల్చారు.

ఈ భవనాల మరమ్మత్తులకు భారీగా నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. సొంత భవనాల మరమ్మత్తులకు రూ. 14 కోట్లు, రెంట్ ఫ్రీ భవనాల మరమ్మత్తులకు రూ. 3 కోట్లు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, కామారెడ్డి, గద్వాల్, హనుమకొండ, మెదక్, వనపర్తి, ఆసిఫాబాద్, ములుగు వంటి జిల్లాల్లో వందల సంఖ్యలో అంగన్వాడీ భవనాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. కొన్ని కేంద్రాల్లో వర్షపు నీరు లోపలకు చేరడంతో బియ్యం, పప్పులు, పాల డబ్బులు, నూనె ప్యాకెట్లు, స్టడీ మెటీరియల్ తడిసి ముద్దయ్యాయి.

ఈ నేపథ్యంలో తడిసిన భవనాల్లో అంగన్వాడీ సేవలు తక్షణం నిలిపివేయాలని, సమీపంలోని ప్రభుత్వ భవనాలు లేదా పాఠశాల ప్రాంగణాల్లో కేంద్రాలను తాత్కాలికంగా తరలించాలని మంత్రి సీతక్క అధికారులు ఆదేశించారు. అలాగే తడిసిపోయిన సరుకుల బదులుగా వెంటనే కొత్త సరుకులను సరఫరా చేయాలని స్పష్టం చేశారు. పిల్లల పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, విద్య ఒక్కరోజు కూడా అంతరాయం లేకుండా కొనసాగాలని మంత్రి హితవు పలికారు. సురక్షిత భవనాల్లో అంగన్వాడి సేవలు నిరంతరం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Next Story