కావాలనే మా ఫైల్స్‌ పెండింగ్‌లో పెడుతున్నారు.. అధికారులపై మంత్రి సీతక్క సీరియస్

by Ramesh Naini |

అడవుల సరిహద్దుల్లో ఉండాల్సిన చెక్ పోస్టులను.. గ్రామాల్లో ఏర్పాటుచేసి ఇబ్బందులు పెడుతున్నారని అధికారులపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు.

కావాలనే మా ఫైల్స్‌ పెండింగ్‌లో పెడుతున్నారు.. అధికారులపై మంత్రి సీతక్క సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: అడవుల సరిహద్దుల్లో ఉండాల్సిన చెక్ పోస్టులను.. గ్రామాల్లో ఏర్పాటుచేసి ఇబ్బందులు పెడుతున్నారని అధికారులపై మంత్రి సీతక్క (Minister Seethakka) సీరియస్ అయ్యారు. (forest officials) నిబంధనలకు లోబడే అధికారులు వ్యవహరించాలని మంత్రి సీతక్క సూచించారు. ఇవాళ (శనివారం) ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పంచాయతీ, ఆర్ అండ్ బీ, మౌలిక వసతుల కల్పన సంబంధిత పనులకు అటవీ శాఖ అనుమతులకి ఏర్పడిన ఇబ్బందులను పరిష్కరించేందుకు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ (State Forest Minister Konda Surekha), పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అటవీ శాఖ కఠిన నిబంధనల వల్ల ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అటవీ సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజల తరఫున వారి సమస్యలను ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకొస్తున్నారని చెప్పారు. అందుకే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాలు చూపించాలనే ఉద్దేశంతో అడవి శాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, రోడ్లు భవనాల శాఖ, ఐటీడీఏ శాఖలతో నేడు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను విస్తృతంగా చర్చించి ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తామని తెలిపారు.

అటవీ ప్రాంతాల్లోనీ ప్రజల అభివృద్ధికి అటవీశాఖ అధికారులు సహకరించాలని ఆదేశించారు. కనీస రోడ్లు, ఆస్పత్రులు, పాఠశాలలు, తాగునీరు కరెంట్ లైన్‌ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. అడవి చట్టాల పేరు మీద ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. సరైన రోడ్డు లేకపోవడం వల్ల ఎమర్జెన్సీలో అంబులెన్సులు కూడా వెళ్లలేక పోతున్నాయని చెప్పారు. మానవీయ కోణంలో అధికారులంతా తమకు సహకరించాలని కోరారు. తాము పంపే రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలను పెండింగ్‌లో పెడుతున్నారని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి అనుమతులు ఇవ్వకుండా కావాలనే మా ఫైళ్లని అటవీ అధికారులు పెండింగ్లో పెడుతున్నారని ఆరోపించారు. దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతోందని, రైట్ ఆఫ్ వే ఉన్నచోట రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని అటవీ చట్టాలు చెబుతున్నాయని వివరించారు.

1980 కంటే ముందు ఉన్న పల్లెల్లో రహదారులుంటే.. అవి పాడైతే అక్కడ మరమ్మతులు చేపట్టవచ్చని, అవసరమైన చోట కొత్త రహదారులు అటవీ చట్టాలు చెబుతున్నాయని గుర్తుకు చేశారు. అయినా అటవీ అధికారులు ఎందుకు అభ్యంతరాలు చెబుతున్నారని ప్రశ్నించారు. అటవీ శాఖ నిబంధనలు అడ్డుగా ఉంటే.. చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు తెప్పించాలని, అడవి మీద ఆధారపడ్డ ఆదివాసీ గిరిజనులు, ఉత్పత్తులు సేకరించవచ్చని అటవీ చట్టం స్పష్టం చేస్తోందన్నారు. అయినా తునికాకు, పండ్ల సేకరణకు వెళ్లిన ఆదివాసీలను గిరిజనులను ఎందుకు ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఆరోపించారు. అటవీ పరిరక్షించబడాలని, అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలని, ఈ రెండింటినీ సమన్వయం చేసేలా అన్ని శాఖ అధికారులు వ్యవహరించాలని సూచించారు. ఈ సమీక్షలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ, ఉమ్మడి జిల్లాల పరిధిలోని కలెక్టర్లు, ఎంఎల్ఏ, ఎమ్మెల్సీ, సీసీఎఫ్, డీఎఫ్ఓ, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వెడ్మా బొజ్జు, కోవా లక్ష్మీ, పాల్వాయి హరీశ్, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండే విఠల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story