- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజన కెఫెటేరియా, ఆలయాలు ప్రారంభించిన మంత్రి సీతక్క
గిరిజనులు, అటవీ ప్రాంత వాసులకే పరిమితమైన చిరు, తృణ ధాన్యాలు.. కల్తీకి తావులేని సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులతో తయారు చేసిన చిరుతిళ్లు, వంటకాలను తెలంగాణ ప్రజలందరికి రుచి చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో : గిరిజనులు, అటవీ ప్రాంత వాసులకే పరిమితమైన చిరు, తృణ ధాన్యాలు.. కల్తీకి తావులేని సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులతో తయారు చేసిన చిరుతిళ్లు, వంటకాలను తెలంగాణ ప్రజలందరికి రుచి చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ లో ఉన్నటువంటి సంక్షేమ భవన్ మ్యూజియం వద్ద గిరిజన సంక్షేమ శాఖ గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో గిరిజన కెఫెటేరియా, ఆలయాల ఏర్పాటు చేశారు. మంగళవారం పంచాయితీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క లంఛనంగా ప్రారంభించారు. పూర్తిగా చెక్కలు, కొయ్యలతోనే రూపుదిద్దుకున్న స్టాళ్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. సిమెంట్ లేకుండా ఎర్రమట్టితో అలికిన కెఫెటేరియా చాలా సహజ సిద్ధంగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉట్నూరు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఏటూరు నాగారం ఐటీడీఏలు.. ప్రతి ఒక్కరికీ నోరూరించే స్వీట్లు, గారెలు తదితర చిరు తిళ్లు, ఇతర వంటకాలు ఇక్కడ అందుబాటులో ఉండనున్నాయి.
అటవీ ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు...– మంత్రి సీతక్క
అటవీ ఉత్పత్తులతో తయారు చేస్తున్న వంటకాల్లో కల్తీకి ఆస్కారం లేకపోవడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మంత్రి సీతక్క తెలిపారు. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో యూనిట్లలో ఇప్పపువ్వుతో కూడిన స్వీటు, ఇప్ప లడ్డూ, ఇప్ప గారెలు, చపాతీలతోపాటు సుమారు 20 రకాల పిండి వంటలు, చిరు తిళ్లు తయారు చేస్తున్నారని చెప్పారు. భద్రాచలం, ఆదిలాబాద్, ఏటూరునాగారం ఐటీడీఏ యూనిట్లలో చిరు, తృణ ధాన్యాలతో తయారు చేస్తున్న పలు చిరు తిళ్లలో ప్రోటీన్లు, కొవ్వు పదార్ధాలు, మాంస కృత్తులన్నీ సమపాళ్లలో ఉంటాయని ఆమె పేర్కొన్నారు. అటవీ ఉత్పత్తులతో తయారు చేసిన చిరుతిళ్లు, ఇతర వంటకాలను ప్రజలందరికీ పరిచయం చేసేందుకు ప్రభుత్వం ఇక్కడ గిరిజన కెఫెటేరియా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే, 11 గిరిజన జాతుల చరిత్ర, వారి సంప్రదాయ ఆచారాలను ప్రజలకు తెలియజెప్పేందుకు ఆలయాలు ఏర్పాటు చేశామన్నారు.
లంబాడీ (సంత్ సేవాలాల్), ఎరుకల, కొండరెడ్డి, చెంచు, తోటి, కొలాం, కోయ, నాయక్‌పోడు, పర్ధాన్, గోండ్, అంధ్ జాతుల జాతరలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని, దీనిలోభాగంగానే 11 గిరిజన జాతుల జాతరలు, వారి సంప్రదాయ సంస్కృతులనూ ప్రజలకు తెలిపేలా ‘గిరిజన దేవాలయాలు’ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, ఆదినారాయణ కోవ లక్ష్మి అనిల్ జాదవ్, ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. గిరిజన మ్యూజియంను మంత్రి సీతక్క కలియ తిరిగి గిరిజనుల సంస్కృతి, పోరాటం, తెగల చిత్రాలను ఆసక్తిగా తిలకించారు.






