సమ్మక్క- సారల‌మ్మ మ‌హా జాత‌ర‌కు రండి : రాష్ట్ర‌ప‌తికి ప్రత్యేక ఆహ్వానం అంద‌చేసిన‌ మంత్రి సీత‌క్క‌

by Muthe.Rajitha |

జ‌న‌వ‌రిలో జ‌రిగే సమ్మక్క, సారల‌మ్మ మ‌హా జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు గ్రామీణాభివ్రుద్ది, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క ఆహ్వానం ప‌లికారు.

సమ్మక్క- సారల‌మ్మ మ‌హా జాత‌ర‌కు రండి : రాష్ట్ర‌ప‌తికి ప్రత్యేక ఆహ్వానం అంద‌చేసిన‌ మంత్రి సీత‌క్క‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: జ‌న‌వ‌రిలో జ‌రిగే సమ్మక్క, సారల‌మ్మ మ‌హా జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు గ్రామీణాభివ్రుద్ది, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క ఆహ్వానం ప‌లికారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాత‌ర‌కు రావాల‌ని, రాష్ట్ర ప్రభుత్వం, ఆదివాసీ సమాజం తరఫున ఆమెను ఆహ్వానిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్ర‌వారం జ‌రిగిన భార‌తీయ కళామహోత్సవ్‌–2025 వేదిక‌గా రాష్ట్ర‌ప‌తిని ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. భార‌తీయ కళామహోత్సవ్‌–2025 కార్య‌క్ర‌మంలో మంత్రి సీత‌క్క, దేశ వైవిధ్యపు గొప్ప‌దానాన్ని ప్రతిబింబించేలా ప్ర‌సంగించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతీయ కళా, వంటకాల, ప్రజా సంప్రదాయాల వైభవాన్ని ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి అందిస్తున్న ఈ మహోత్సవం భిన్నత్వంలో ఏకత్వం అనే భారత ఆత్మను ప్రతిఫలిస్తుందన్నారు. తెలంగాణ నేలపై జరుగుతున్న ఈ వేడుక దేశవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యాన్ని ఒకే వేదికపై తీసుకువస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను మినీ ఇండియాగా పిలుస్తార‌ని, ఇక్క‌డి గంగా-జమునా సంస్కృతి భారతీయ సమన్వయానికి ప్రతీక అని సీతక్క పేర్కొన్నారు. వైవిధ్యం సవాలు కాదని, అది దేశ బలమని, బలమైన రాష్ట్రాలే బలమైన భారతాన్ని నిర్మిస్తాయని తెలిపారు.

ములుగు పర్యాటకానికి నిధులు కేటాయించండి:

తెలంగాణ సాంస్కృతిక సంపద‌లైన ఒగ్గుకథ, పేరిని శివతాండవం, బోనాలు, బతుకమ్మ, సమ్మక్క-సారల‌మ్మ‌ జాతర వంటి గొప్ప సంప్రదాయాలను మంత్రి సీత‌క్క‌ ప్రస్తావించారు. అలాగే కూచిపూడి, భారతనాట్యం వంటి శాస్త్రీయ కళలతో పాటు గిరిజన, ప్రజా కళలకు తెలంగాణ ఇచ్చే గౌరవాన్ని వివరించారు. తమ గిరిజన మహిళా నేపథ్యాన్ని గుర్తుచేసుకున్న సీతక్క “అడవి మా జీవనాధారం మాత్రమే కాదు, అది మా మతం, మా ఆత్మగౌరవం” అని పేర్కొన్నారు. ఒడిశా నుండి వచ్చిన రాష్ట్రపతి, త్రిపుర కు చెందిన గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వ‌ర్మ ఆదివాసీ గిరిజన మూలాలు, తెలంగాణ గిరిజన ఆదివాసీ సంస్కృతికి బ‌ల‌మైన‌ అనుబంధం ఉందని తెలిపారు.

రాష్ట్రపతి మ‌హాజాత‌ర‌కు విచ్చేస్తే, గిరిజన సమాజానికి మహత్తర ప్రోత్సాహకంగా ఉంటుంద‌ని అన్నారు. భారతీయ కళామహోత్సవం ద్వారా భారత దేశం ఒకే స్వరంతో, ఒకే భావంతో ప్రతిధ్వనిస్తోందని సీతక్క పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతి భవన్‌కు, సంబంధిత శాఖలకు మంత్రి అభినందనలు తెలియజేశారు.

ఆదివాసీ జ‌నాభా అధికంగా ఉన్న ములుగు జిల్లాలో అభివృద్ది ప‌నుల‌కు, ఎకో ఫ్రెండ్లీ టూరీజం ప్రాజెక్టుల‌కు ప్ర‌త్యేక నిధుల‌ను మంజూరు చేయాల‌ని కోరుతు కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షేకావ‌త్ కు మంత్రి సీత‌క్క ప‌లు విన‌తి ప‌త్రాలు అంద‌చేశారు. మ‌ల్లూరు దేవ‌స్థానం అభివృద్ది కోసం రూ. 30 కోట్లు, బొగ‌త వాట‌ర్ ఫాల్స్ అభివృద్ది ప‌నుల కోసం రూ. 50 కోట్లు, జంప‌న్న వాగు అభివృద్ది ప‌నుల కోసంరూ. 50 కోట్లు కేటాయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Next Story