వరదల్లో చిన్నారుల ఆకలి తీర్చిన అంగన్వాడీలు : అభినందించిన మంత్రి సీతక్క

by Muthe.Rajitha |

హన్మకొండలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని చిన్నారుల ఆకలి తీర్చడానికి అంగన్వాడీ సిబ్బంది విశేష సేవలు అందించారు.

వరదల్లో చిన్నారుల ఆకలి తీర్చిన అంగన్వాడీలు : అభినందించిన మంత్రి సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: హన్మకొండలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని చిన్నారుల ఆకలి తీర్చడానికి అంగన్వాడీ సిబ్బంది విశేష సేవలు అందించారు. వారి మానవతా దృక్పథంతో కూడిన చొరవను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అభినందించారు. హన్మకొండ జిల్లాలోని సమ్మయ్యనగర్‌, అమరావతినగర్‌, టీవీ టవర్‌ వంటి ప్రాంతాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, వరద ప్రాంతాల నుండి రక్షించబడిన చిన్నారులకు ఆహారం అందించడంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు గొప్ప సేవాభావాన్ని ప్రదర్శించారు.

పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, సెలవు దినం అయినప్పటికీ విధుల్లోనే ఉండి, వేడిగా వండిన బాలమృతంను చిన్నారులకు అందించారు. స్వయంగా బాలమృతం వండి, వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని పిల్లలకు వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, "అవసర సమయంలో ప్రజల కోసం అంగన్వాడీలు నిలబడటం, చిన్నారుల ఆకలి తీర్చడం గొప్ప సేవ" అని ప్రశంసించారు.

అంగన్వాడీ వ్యవస్థ సామాజిక సేవలో ఒక కాంతి దీపంలా నిలుస్తుందని పేర్కొన్నారు.మొంథా తుఫాను నేపథ్యంలో కూడా అంగన్వాడీ సిబ్బంది చూపుతున్న నిబద్ధత, సేవా భావం పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, డైరెక్టర్ శృతి ఓజా కూడా అభినందనలు తెలియజేశారు.

Next Story