Seethakka: సదరం సర్టిఫికెట్స్ ఆధారంగానే సంక్షేమ పథకాలు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

సదరం సర్టిఫికెట్ల జారీలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, అందుకే అర్హులు చాలా మంది నష్టపోయారని మంత్రి సీతక్క ఆరోపించారు.

Seethakka: సదరం సర్టిఫికెట్స్ ఆధారంగానే సంక్షేమ పథకాలు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సదరం సర్టిఫికెట్ల (Sadarem certificate) జారీలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, అందుకే అర్హులు చాలా మంది నష్టపోయారని మంత్రి సీతక్క (Minister Seethakka) ఆరోపించారు. బేగంపేట లోని టూరిజం ప్లాజాలో సదరం ధ్రువీకరణ పత్రాల కోసం వైకల్య గుర్తింపుపై డాక్టర్లకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఇవాళ (మంగళవారం) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క హజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్లకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత అనుభవాల దృష్టిలో దివ్యాంగుల్లో వైకల్యాన్ని గుర్తించేందుకు డాక్టర్లకు రాష్ట్ర చరిత్రలో మొదటి సారి వర్క్ షాపును నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఎలాంటి వైకల్యం ఉంది, ఎంత శాతం మేర వైకల్యం ఉంది అనే అంశాన్ని డాక్టర్లు పక్కాగా గుర్తించి సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 38 ఆస్పత్రుల్లో సదరం సర్టిఫికెట్ల జారీ కోసం అంగవైకల్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ఒక్కో ఆస్పత్రికి పది లక్షల చొప్పున మొత్తం రూ. 3.8 కోట్లను రిలీజ్ చేసినట్లు స్పష్టం చేశారు. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ ఇవ్వకపోతే వారికి తీవ్ర అన్యాయం చేసినట్టు అవుతుందని అన్నారు. ఈ సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. చేయూత పెన్షన్, ఉద్యోగ ఉపాధి రంగాల్లో రిజర్వేషన్, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం వంటి స్వయం ఉపాధి పథకాలకు సదరం సర్టిఫికెట్స్ ఆధారమన్నారు. అందుకే డాక్టర్లు మానవతను జోడించి వైకల్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. దివ్యాంగులకు ఆత్మగౌరవం దక్కాలంటే డాక్టర్లు పక్కాగా పరీక్షలు నిర్వహించి సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచనలిచ్చారు.

అర్హులు ఎవరు నష్టపోకూడదని, వైద్య వృత్తి అంటే ప్రాణం పోసే వృత్తి అని చెప్పారు. 21 రకాల వైకల్యాలను గుర్తించి సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలు ఇచ్చారని గుర్తుకు చేశారు. ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తున్నామని చెప్పారు. వైకల్యాన్ని సరిగా జడ్జి చేసేందుకు డాక్టర్లకు ఓరియంటేషన్ ఇప్పిస్తున్నామన్నారు. ఎంతో అనుభవం ఉన్న వైద్యులతో, నిపుణులతో డాక్టర్లకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. సర్టిఫికెట్ల ఆధారంగానే దివ్యాంగులకు ఉపాధి ఉద్యోగం ఆత్మగౌరవం లభిస్తోందన్నారు. ఈ పవిత్ర యజ్ఞంలో దివ్యాంగులందరికీ డాక్టర్లు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దివ్యాంగుల పరికరాల కోసం ప్రతి ఏడాది రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఓరియంటేషన్ కార్యక్రమానికి రెండు వందలకు పైగా డాక్టర్లు హాజరయ్యారని తెలిపారు.

Next Story