- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేట్ ప్లే స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దాలి: సీతక్క
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని, ప్రైవేట్ ప్లే స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దాలని

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని, ప్రైవేట్ ప్లే స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, 'అమ్మ మాట - అంగన్‌వాడీ బాట' నినాదంతో ప్రచారం చేయాలని సూచించారు. గురువారం సచివాలం లో మహిళా శిశు సంక్షేమ శాఖ పై డిడబ్లూఓ లతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంగన్వాడీ ల బలోపేతం పై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు బడిలో, అంగన్‌వాడీ వయసు పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండేలా అధికార యంత్రాంగం కృషి చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫర్నిచర్, ఆట వస్తువులు, ప్రీ-ప్రైమరీ విద్య, యూనిఫాంలు అందిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అక్షర జ్ఞానంతో పాటు వికాసం, ఉల్లాసం, పోషకాహార కేంద్రాలుగా అంగన్‌వాడీలు ఉన్నాయన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని అన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును ప్రజలకు తెలియజేసేందుకు వీడియోలు, ఫొటోలతో ప్రచారం చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత డీడబ్ల్యూఓలదేనని స్పష్టం చేశారు. సరైన పోషకాహారం అందితేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై దృష్టి పెట్టగలరని అన్నారు. అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు, తాగునీరు, టాయిలెట్లు ఉండేలా చూడాలని, సరైన వసతులు లేని అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలోని ప్రభుత్వ భవనాలకు లేదా ప్రభుత్వ పాఠశాలలకు మార్చాలని సూచించారు. ఇరుకు గదుల్లో అంగన్‌వాడీ కేంద్రాలు ఉండటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు.
ఒక్కో అంగన్ వాడీ కేంద్రం నిర్మాణానికి 12 లక్షలు:
ఒక్కో అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణానికి రూ. 12 లక్షలు మంజూరు చేశామని, తక్షణమే నిర్మాణ పనులు ప్రారంభించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. అంగన్‌వాడీ లబ్ధిదారులకు పోషకాహారం అందేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. పీఎం జన్మన్ స్కీం ద్వారా పీవీటీజీ ఆవాసాల్లో 8 అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరు అయ్యాయని, వాటిని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. 85 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి రూ.12 లక్షలు, ఉపాధి హామీ నిధుల ద్వారా 457 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, వాటి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
500 అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో 289 కేంద్రాల్లో పనులు పూర్తయ్యాయని, మిగిలిన 211 కేంద్రాల్లో పనులు పూర్తి చేయాలని మంత్రి సీతక్క తెలిపారు. 1,811 అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి లేదని గుర్తించామని, అందులో 653 కేంద్రాల్లో వసతి కల్పించామని, మిగిలిన 1,158 కేంద్రాల్లో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. 7,021 అంగన్‌వాడీ కేంద్రాల్లో టాయిలెట్లు లేవని గుర్తించామని, అందులో 2,004 కేంద్రాల్లో నిర్మాణం పూర్తయిందని, మిగిలిన 4,977 కేంద్రాల్లో పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చిన్నారుల చిరునవ్వుకు చిరునామాగా అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ పాల్గొన్నారు.






