‘అసెంబ్లీలో మీ బండారం మొత్తం బయటపెడతా’.. మంత్రి సీతక్క సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Minister Seethakka) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘అసెంబ్లీలో మీ బండారం మొత్తం బయటపెడతా’.. మంత్రి సీతక్క సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Minister Seethakka) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మధురానగర్ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పరేడ్ గ్రౌండ్లో మహిళా సభ విజయవంతమైంది. అందుకే కడుపు మంటతో కళ్ళల్లో నిప్పులు పోసుకొని హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు మీరేం చేయలేదనే విషయం మహిళలందరికీ తెలుసు. వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మహిళలకు చేస్తున్న మంచిని చూసి ఓర్వలేక.. రాష్ట్రంలో మహిళలు అప్పుల పాలు అవుతున్నారని హరీష్ రావు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. మహిళా సంక్షేమం పట్ల మీది దరిద్రమైన పాలన అని సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కవిత తప్ప ఎవరూ ఎదగలేదు. బతుకమ్మ వేడుకలు అయినా, బీసీ ఉద్యమం అయినా, మహిళా ఉద్యమమైనా కవిత(MLC Kavitha)ను ఒక్కదానినే ముందుంచారు అని గుర్తుచేశారు. అందుకే లక్ష మంది తరలివచ్చి మహిళా సభను సక్సెస్ చేస్తే మీరు ఓర్వ లేకపోతున్నారని విమర్శించారు.

‘మీరు ఐదు సంవత్సరాలలో మహిళా సంఘాలకు రూ.3485 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ.409 కోట్లు మాత్రమే చెల్లించారు. హరీష్ రావు ఆర్థిక మంత్రిగా చివరి మూడేళ్లలో మహిళా సంఘాల వడ్డీల కోసం నయా పైస చెల్లించలేదు. మహిళలకు మూడేళ్లు గుండు సున్నా పెట్టి పోయారు. వేల కోట్ల వడ్డీలు చెల్లించకుండా మహిళలను మోసం చేశారు. ఆడబిడ్డలు రూపాయి రూపాయి పోగేసుకున్న అభయహస్తం డబ్బులను దిగమింగిన చరిత్ర మీది.. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళలకు పూర్తి స్థాయిలో వడ్డీలు చెల్లించాము. ఈ ఏడాదికి సంబంధించి వడ్డీలు మహిళలకు చెల్లించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాదవశాత్తు మహిళా సంగం సభ్యురాలు మరణిస్తే ప్రమాద బీమా ఇవ్వాలన్న ఆలోచన మీరు చేయలేదు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కానీ తాము మహిళా సంఘాల మీద భారం పడకుండా ప్రతీ సభ్యురాలి కుటుంబం మీద పది లక్షల రూపాయల ప్రమాద బీమా చెల్లిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 400 మంది మహిళలకు రూ.40 కోట్లకు పైగా చెల్లిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల పట్ల ఇది మా చిత్తశుద్ధి అని చెప్పారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా హరీష్ రావు వ్యవరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా మీ బండారాన్ని బయటపెడతామని సీతక్క సంచలన ప్రకటన చేశారు. ఎవరు మహిళా సంక్షేమం కోసం ఎంత చేశారో అక్కడే తేల్చుకుందామని సవాల్ చేశారు.

Next Story