- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పకుండా ప్రశ్నిస్తాం.. మోడీ తెలంగాణ పర్యటనపై మంత్రి పొన్నం
తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ప్రధాని పర్యటనలో రాష్ట్రానికి ఏమిచ్చారో ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పర్యటకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని రాజకీయ వ్యవస్థీకృత విధానంలో స్వాగతిస్తామని కానీ రాజకీయ పార్టీగా మాత్రం ఈ రాష్ట్రానికి ఏమిచ్చారో తప్పకుండా ప్రశ్నిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత 12 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి మోడీ ఏం చేశారో చెప్పాలన్నారు. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రాన్ని అడగలేదో లేదా మీరు ఇవ్వలేదో కానీ మేము అధికారంలోకి వచ్చాక ప్రధాన మంత్రి నుండి మొదలుపెడితే ప్రతి కేంద్ర మంత్రి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులం వెళ్ళి మాకు కావాల్సిన అంశాలపై వినతులు ఇస్తున్నా రాష్ట్రం పట్ల వివక్ష చూపిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‍కు నిధులు ఇస్తే మాకు ఏం ఆక్షేపణ లేదు. కానీ ఈ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు మీకు ప్రాతినిథ్యం వహిస్తున్నారని తెలంగాణకు కూడా నిధులు ఇచ్చే బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదన్నారు.
తెలంగాణ ద్రోహి మీరు:
నిధులు ఇవ్వకుండా కక్షపూరితంగా వ్యవహరించడంతో పాటు ఆఖరికి రాష్ట్ర ఏర్పాటును సైతం బీజేపీ అవమానిస్తోందని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని స్వయంగా ప్రధాని మోడీ అంటే, బీజేపీ ఎంపీ రాష్ట్ర విభజనను పాకిస్తాన్ విభజనతో పోల్చారని మండిపడ్డారు. మరో బీజేపీ నాయకుడు మాట్లాడుతూ ఇంత మంది అమరవీరులు చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపిస్తున్నాడు. నాడు ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడలో అన్నది బీజేపీ కాదా? దేశంలో మూడు రాష్ట్రాలు ఇచ్చిన నాడే తెలంగాణ కూడా ఇచ్చి ఉంటే ఇక్కడ ఈ పరిస్థితి ఉండేదా అని నిలదీశారు. మీ నిర్లక్ష్యం, మీ రాజకీయ ఒత్తిడుల వల్ల తెలంగాణ ఏర్పాటుకు తీర్మానం చేసి కూడా ఇవ్వని ద్రోహులు మీరు అని ఫైర్ అయ్యారు. బీజేపీ తెలంగాణ ద్రోహి అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే బీఆర్ఎస్ కు రాక్షసానందం అని విమర్శించారు. ఈ రాష్ట్రంలో మరో ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందన్నారు.






