మునిగిపోయే నావలోంచి కవిత దూకాలని చూస్తోంది: మంత్రి పొన్నం

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎమ్మెల్సీ కవిత లేఖ ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

మునిగిపోయే నావలోంచి కవిత దూకాలని చూస్తోంది: మంత్రి పొన్నం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎమ్మెల్సీ కవిత లేఖ ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేరు కాదనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల వ్యవహారం గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్న చందంగా ఉందని అన్నారు. బీజేపీ ఎందుకు బీఆర్ఎస్‌ను ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తే.. రాజకీయం అన్నారని.. ఇప్పుడు అదే విషయంలో కేసీఆర్‌ను కన్న కూతురురే అడుగుతుంది ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రహస్య ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి గులాబీ పార్టీకి పూర్తిగా సరెండర్ అయిపోయిందంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీపై కేసీఆర్ ఎలాంటి కామెంట్ చేయకపోవడాన్ని కవిత జీర్ణించుకోలేకపోయిందని అందుకే అన్ని విషయాలను ఆమె లేఖ ద్వారా బయటపెట్టిందని స్పష్టం చేశారు. కవిత రాసిన లేఖపై కేటీఆర్‌తో పాటు హరీశ్ రావు సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

కవిత బయటకు రావాలని చూస్తోంది: ప్రభుత్వ విప్​బీర్ల ఐలయ్య

పదేండ్ల బీఆర్ఎస్ పాపాలను లేఖ ద్వారా కవిత బయటపెట్టిందని ప్రభుత్వ విప్​బీర్ల ఐలయ్య అన్నారు. అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ.. అందులో నుంచి దూకాలని కవిత చూస్తోందన్నారు. పదేండ్లలో కవితకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకురాలేదని ప్రశ్నించారు. వరంగల్ సభలో నియంతలా కేసీఆర్ ఒక్కడే మాట్లాడాడు అని కవిత చెప్పిందన్నారు. బీజేపీతో మీకు ఉన్న సంబంధం కవిత బయట పెట్టిందన్నారు. ఎస్సీ వర్గీకరణ, కులగణనపై కేసీఆర్ మౌనంగా ఉన్నారని కవిత తన లేఖలో స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పదేండ్లు దోచుకున్న సంపదలో వాటాల కోసమే కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీ మొదలైందన్నారు.

పదేండ్లు కవిత ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదని విప్​ప్రశ్నించారు. ఆస్తుల పంపకాలలో తేడాలు రావడంతో కవితకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకొచ్చారని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను కేసీఆర్ పార్టీ నుండి బయటికి పంపినప్పుడు కవితకు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. పార్టీ నుంచి బయటకు పంపుతారన్న భయంతోనే కవిత ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందాన్ని బయట పెట్టినందుకు కవితకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ బంధం బయటపడిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ముందే కవిత ఈ విషయాన్ని బయట పెడితే బీజేపీకి ఆ సీట్లు కూడా వచ్చేవి కావని స్పష్టం చేశారు.

పదేండ్లు కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి పాలన చేస్తుంటే కవిత ఎందుకు మాట్లాడలేదు..? అని ప్రశ్నించారు. జనాలు ప్రతిపక్ష పాత్ర ఇస్తే పట్టించుకోకుండా కేసీఆర్ ఫాంహౌస్‌కు పరిమితమయ్యారన్నారు. కవిత లేఖపై కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. హరీష్ రావు బీజేపీలోకి పోతుంటే కేటీఆర్ ఆయన కాళ్ళు పట్టుకున్నారని మీడియాలో చూశానని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని నమ్మితే కేటీఆర్ సీబీఐ విచారణ కోరాలన్నారు. కాళేశ్వరం పైన సీబీఐ విచారణ కోరుతూ బీఆర్ఎస్ పార్టీ కేంద్రానికి లేఖ రాయాలన్నారు. మేడిగడ్డలో కాంగ్రెస్ వాళ్లు బాంబు పెట్టారని కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు.

కేటీఆర్ మైండ్ దొబ్బినట్లు కనిపిస్తోందని విమర్శించారు. మేము బాంబులు ఎందుకు పెడతాము, డబ్బు మదంతో కేటీఆర్ మాట్లాడుతున్నాడని అన్నారు. సీఎం రేవంత్‌పై కేటీఆర్ అవాకులు చెవాకులు పేలితే కాంగ్రెస్​కార్యకర్తలు బట్టలు ఇప్పించి రోడ్డు మీద కొడతారని హెచ్చరించారు. హరీష్ రావు ఆరు అడుగులు ఉన్నాడు కానీ దామాక్ లేదన్నారు. కవిత కేసీఆర్ తప్పులు జనాలకు చెప్పినందుకు తెలంగాణ ప్రజలు సంతోషిస్తున్నారని తెలిపారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్నారు. బీఆర్ఎస్ గురించి ఆలోచించే సమయం ముఖ్యమంత్రి రేవతంత్​రెడ్డికి లేదని స్పష్టం చేశారు.

Next Story