- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponnam Prabhakar: నార్వే, చైనాలతో తెలంగాణ పోటీ
ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ప్రోత్సాహకాలు అందించేలా వాహన కంపెనీలతో మాట్లాడామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ప్రోత్సాహకాలు అందించేలా వాహన కంపెనీలతో మాట్లాడామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు 10-20 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా మహీంద్రా ఎలక్ట్రిక్స్, ఆథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలాతో పాటు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని మంత్రి వెల్లడించారు. మంగళవారం సెక్రటేరియట్ లో సీఎస్, డీజీపీ, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి ఈవీలను పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీలు ఉపయోగించేలా డిస్కౌంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెక్రటేరియట్ లో సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చిందని... పాలసీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈవీల వినియోగం 0.60 నుండి 1.50 శాతం పెరిగిందని తెలిపారు.
ఈవీ పాలసీలో రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ పూర్తిగా 100 శాతం మినహాయింపు ఇవ్వడం ద్వారా పాలసీ ప్రారంభమైనప్పటి నుండి 1,15,551 ఈవీలకు రూ. 925.94 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం నష్టపోయినప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కాలుష్యం బారిన పడొద్దనే ఈవీ పాలసీ తెచ్చామన్నారు. తమ ప్రభుత్వం విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి సుస్థిర రవాణాను ప్రోత్సహించడం, సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కొనే వాహనాలు కూడా ఈవీలే ఉండేలా ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారని అందుకు హైర్ పద్ధతిలో లేదా వివిధ శాఖల నుండి వాహనాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ వాహనాల వినియోగంలో తెలంగాణ నార్వే, చైనాలతో పోటీపడుతుందని తెలిపారు. ఈవీలకు ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్యూర్ ఏరియాలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని.. డీజిల్ ఆటోలు కూడా రెట్రో ఫిట్ గా మార్చి నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రం వాహన్, సారథి పోర్టల్ లోకి చేరిందని... వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు షో రూమ్ లోనే రిజిస్టేషన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.






