ప్రధాని వద్ద సమయం ఇప్పిస్తారా? ప్రభుత్వ కృషికి గండి కొట్టొద్దు: మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

లక్ష్మణ్‌కు తెలంగాణలో చేసిన కుల గణన మీద అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు.

ప్రధాని వద్ద సమయం ఇప్పిస్తారా? ప్రభుత్వ కృషికి గండి కొట్టొద్దు: మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మీరు ప్రధాని వద్ద సమయం ఇప్పిస్తారా..? లక్ష్మణ్‌కు తెలంగాణలో చేసిన (Caste Census) కుల గణన మీద అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Minister Ponnam Prabhakar Goud) తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ (ఆదివారం) ఒక ప్రకటన విడుదల చేశారు. (Dedicated Commission) డెడికేటెడ్ కమిషన్ వేసుకొని లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులతో పారదర్శకంగా సర్వే నిర్వహించామని తెలిపారు. మహారాష్ట్రలో బీసీ కుల గణన చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేయగానే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చారని, బీహార్ లో కుల గణన చేపట్టి ఆ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టక ముందే (RJD, JDU) ఆర్జేడీ, జేడీయూ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసిందని ఆరోపించారు. జార్ఖండ్‌లో బీసీల రిజర్వేషన్లు పెంచుతామని అసెంబ్లీలో తీర్మానం పెట్టగానే తప్పుడు కేసులతో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ ను జైల్లో వేశారని, అటువంటి చరిత్ర బీజేపీ కేంద్ర ప్రభుత్వానిదని తీవ్ర ఆరోపణలు చేశారు.

రాష్ట్రాల నుంచి కేంద్రం వరకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. బీజేపీ అధ్యక్ష పదవి, శాసన సభలో బీజేపీ ప్రతిపక్ష నాయకుడి పదవి, మండలిలో పక్ష నాయకుడి పదవిలకు బీసీలు పనికిరారా? అని నిలదీశారు. అన్ని అత్యున్నత పదవులు వేరే సామాజిక వర్గానికి కేటాయించిన బీసీ లపై మొసలి కన్నీరు కారిస్తే సమాజం అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు. చేతనైతే బీసీలకు ప్రయోజనాలు కల్పించాలి అంతేతప్ప.. ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ కృషికి గండి కొట్టొద్దన్నారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన బిల్లును ఆమోదింపజేసి బీసీ లపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

బీసీ కేంద్ర విద్యా సంస్థలైన ఐఐటీ, ఐఐఎం లాంటి వాటిలో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వలదని గుర్తుకు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ పై బీజేపీ నేత లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుల గణన కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళ్లి అఫిడవిట్ సమర్పించిన చరిత్ర బీజేపీదన్నారు. మండల్ కమిషన్ వస్తే కమండలం తీసుకొచ్చింది బీజేపీ.. బీజేపీ అగ్రవర్ణాల ఫ్యూడలిస్ట్ పార్టీ అని విమర్శించారు. కులగణన చేసి బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచి చేసిన చట్టం తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా మారిందన్నారు. తెలంగాణను చూసే తప్పని పరిస్థితుల్లో కేంద్రంలో జన గణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. తెలంగాణలో చేసిన కుల గణన చూసి దేశవ్యాప్తంగా చేస్తున్నారని, ఇక్కడ చేసిన కుల సర్వే ఆధారంగా పెంచిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను పెంచుతూ చేసిన చట్టాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు ఆమోదింపజేసి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Next Story