ఆ ప్రచారం నమ్మొద్దు.. ఆర్టీసీ హామీలపై మంత్రి పొన్నం కీలక ప్రకటన

by Prasad Jukanti |

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేసింది.

ఆ ప్రచారం నమ్మొద్దు.. ఆర్టీసీ  హామీలపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
X

దిశ,తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కొంతమంది కార్మిక సంఘాల నాయకులు వాస్తవాలను వక్రీకరిస్తూ కార్మికులను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం బాధాకరమని ఆయన అన్నారు. ఈ మేరకు కార్మిక సంఘాల డిమాండ్లు, ఆర్టీసీ విలీన ప్రక్రియపై మంత్రి ఇవాళ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులు, ప్రతి కార్మిక సంఘం నుంచి ఇద్దరు చొప్పున దాదాపు 30 మంది కార్మిక సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా 14 గంటల పాటు చర్చించి అందరి ఆమోదంతో ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి గుర్తు చేశారు.

అందుకే యూనియన్ ఎన్నికలు:

సమావేశంలో మొత్తం 32 డిమాండ్లలో 29 అంశాలు ఆర్టీసీ యాజమాన్యం పరిధిలో, మూడు అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నట్లు నిర్ణయించడం జరిగిందన్నారు. యాజమాన్యం పరిధిలో ఉన్న 29 అంశాల పరిష్కారానికి ఈడిల కమిటీ ద్వారా ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న మూడు కీలక అంశాలైన ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలు, 2021 పీఆర్సీ, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ప్రకటించిన 11 శాతం జూలై నెల జీతాల నుంచే అమల్లోకి రానుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల మొదటి డిమాండ్ ఆర్టీసీ గుర్తింపు సంఘాలు ఎన్నికలు అని ఇప్పుడు మాట మార్చి ప్రజలను,కార్మికులను పక్కదోవ పట్టించడం సరికాదన్నారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి విధివిధానాలు రూపొందించే అధికారుల కమిటీలో కార్మిక ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలని సమావేశంలో కార్మికులు ఏకగ్రీవంగా నిర్ణయించారని మంత్రి పేర్కొన్నారు. అయితే ఆ కమిటీలో ఉండే కార్మిక నాయకులు గుర్తింపు పొందిన సంఘం నుంచి ఉండాలంటే ముందుగా గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం అందరి సమక్షంలో తీసుకున్నామని వెల్లడించారు.

ఏపీలో మాదిరిగా కాకూడదనే:

ఇందులో భాగంగానే ప్రభుత్వం ఇప్పటికే గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిందని, లేబర్ జాయింట్ కమిషనర్ సునీతను ఎన్నికల నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి త్వరలోనే గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించే దిశగా వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకే ముందుగా గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించి, ఆ సంఘం నుంచి ప్రతినిధులను విలీన కమిటీలో చేర్చే ప్రక్రియను ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ మాదిరి విలీనం తర్వాత ఇబ్బందులు కలగవద్దని గుర్తింపు కార్మిక సంఘాల నేతలను కమిటీలో చేర్చి విధివిధానాలు రూపొందించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది కార్మిక సంఘాల నాయకులు గుర్తింపు సంఘాల ఎన్నికలు జరగకుండా, విలీన ప్రక్రియను కూడా వివాదాస్పదం చేసేలా వ్యవహరించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని, కార్మికులు వాస్తవాలను గుర్తించి అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. మాట మీద నిలబడే కాంగ్రెస్ ప్రభుత్వం విలీన ప్రక్రియ గురించి భవిష్యత్‍లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని గుర్తింపు సంఘం కార్మిక నేతలను కమిటీలో చేర్చి విలీన విధివిధానాలు రూపొందించాలని భావిస్తుందని దీనిని కార్మికులంతా గమనించాలన్నారు.

Next Story