Ponguleti: అసైన్డ్ భూములను వెనక్కి తీసుకోవడంపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |

కూకట్‌పల్లి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల సముదాయానికి శంకుస్థాపన సందర్భంగా మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Ponguleti: అసైన్డ్ భూములను వెనక్కి తీసుకోవడంపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా అవినీతి రహితంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి తెలిపారు. ప్రజలకు సౌకర్యం, పరిపాలనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక సౌకర్యాలతో, కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా నిర్మిస్తున్నామన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్ పల్లి మండలంలో ఎస్.ఎస్.ఆర్ బిల్డర్స్ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సోమవారం మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడతలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో, రెండో విడతలో జిల్లా కేంద్రాల్లో, మూడో విడతలో నియోజకవర్గ కేంద్రాలలో సమీకృత భవనాలు నిర్మిస్తామన్నారు.

నాలుగు జిల్లాలు.. 112 క్లస్టర్లు:

ఫస్ట్ ఫేజ్ కింద ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి నాలుగు జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి ఇంటిగ్రేటెడ్ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) భవనంలో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశామని, వచ్చే జూన్ 2 నాటికి ఈ భవనాన్ని ప్రారంభించుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా బిల్డర్స్ తోనే ఈ 12 స‌మీకృత భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. అంతేగాక స‌మీకృత భ‌వ‌నాల‌ను నిర్మించే సంస్థలే ఐదేళ్లపాటు వాటిని నిర్వహించాలన్న నిబంధన కూడా పొందుపరిచామన్నారు. ఈ భవనాల్లో మహిళలు, పిల్లల తల్లుల, పేదలకు సకల సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ఆదాయ వనరుగా కాకుండా సేవా కేంద్రంగా చూస్తోందని స్పష్టం చేశారు.

అసైండ్ భూములకు పరిహారం:

గ‌త రెండేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా కేవ‌లం రాష్ట్ర ప్రభుత్వ ఖ‌జానాకు డ‌బ్బు చేకూర్చాల‌నే ఆలోచ‌న కాకుండా పేద‌వారిని దృష్టిలో పెట్టుకొని వివిధ సంస్కరణలు తెచ్చామ‌ని మంత్రి తెలిపారు. పేద‌ల‌కు గ‌తంలో ఇచ్చిన భూముల‌తోపాటు ప్రభుత్వ భూములను ప‌రిర‌క్షిస్తామ‌ని, ఈవిష‌యంలో ఉక్కుపాదంతో అక్రమాలను అణ‌చివేస్తామ‌ని వెల్లడించారు. ప్రతిపక్షాలతో విమ‌ర్శించుకునే ప‌రిస్థితి రాకుండా పేద‌ల ప‌క్షాన ప్రభుత్వం ప‌నిచేస్తుంద‌ని స్పష్టం చేశారు. ఒక‌ప్పుడు పేద‌ల‌కు పంపిణీ చేసిన భూముల‌ను, అసైన్డ్ భూముల‌ను ఒక వేళ ప్రభుత్వం తీసుకోవాల‌నుకున్నా వారికి త‌గిన ప‌రిహారం, ప్రత్యామ్నాయ స్థలం మంజూరు వంటి చర్యలు తప్పనిసరిగా ఉంటాయన్నారు. త్వరలో జరగబోయే మేడారం మహా జాతర కోసం భారీ నిర్మాణఆలతో ఆధునీకరించామని ప్రజలు ఈ జాతరకు రావాలని మంత్రి కోరారు.

Next Story