ఒక్కరి వల్ల జరగదు.. సీఎం పదవిపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

సీఎం పదవి, తన రాజకీయ వారసత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒక్కరి వల్ల జరగదు..  సీఎం పదవిపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి పదవి విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాశకు వెళ్లి అందని ద్రాక్ష కోసం ఎగిరెగిరి కాళ్లు విరగొట్టుకోబోనన్నారు. ఈ విషయంలో తనకు చాలా క్లారిటీ ఉందని స్పష్టం చేశారు. తాజాగా ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మంత్రి.. పలు అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. మనిషికి కోరిక ఉండటం తప్పేమి కాదని, తలరాతలో ఏం రాసి ఉంటే అది జరుగుతుంది తప్ప ఆ రాతను ఒక వ్యక్తి, వ్యక్తులో మార్చలేరన్నారు. మేరేసే జోడో అంటూ సీఎంకు మోడీ ఇచ్చిన ఆఫర్‍ను రేవంత్ రెడ్డి ఉపయోగించుకోకపోతే ఆ అవకాశాన్ని పొంగులేటి ఉపయోగించుకోబోతున్నారనే ప్రచారంపై మంత్రి స్పందించారు. ప్రధాని వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తనకు ఎమ్మెల్యేల్లో ఎలాంటి గ్రూప్ లేదని తన గ్రూపే కాంగ్రెస్ గ్రూప్ అని చెప్పారు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన తాను వ్యవసాయం ప్రత్యక్షంగా చేశానని వ్యాపారంలో వృద్ధి చెందానని రాజకీయాల్లోకి వచ్చి 13 నెలల్లో ఎంపీ అయ్యానన్నారు.

తన వారసుడు ఎవరంటే?:

తన రాజకీయ వారసుడు అంటూ ఇప్పుడు ఎవరూ లేరని పొంగులేటి స్పష్టం చేశారు. భగవంతుడు ఆయుష్షు ఇస్తే మరో 15-20 ఏళ్లు ఉంటాను. ఆ తర్వాత ఎవరు సమర్ధులో వారు వారసుడిగా వస్తారన్నారు. గత ప్రభుత్వంలో టికెట్ ఇవ్వకుండా తడిబట్టతో గొంతుకోశారన్నారు. బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల తర్వాత MRS (మెదక్ రీజనల్‍ సమితి)గా మారుతుందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం కాబోతోందని అది కూడా 1 లేదా 2 స్థానాలు మాత్రమే గెలుస్తుందన్నారు. ఒక వ్యక్తిని, ఓ పార్టీని నమ్మి పవర్ లేకపోయినా ఐదేళ్లు ప్రజల్లో బ్రతికి ఉన్నానని అదే ప్రజల దీవెనలతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పుకు కారణమైన వారిలో ఒకరిగా ఉన్నానన్నారు. భగవంతుడు ఆయుషు ఇచ్చినంత వరకు పేదల పక్షాన ఉంటూ వారితోనే ఈ జీవితాన్ని ముగించాలనే కోరిక ఉందన్నారు.

Next Story