కాళేశ్వరంపై CBI విచారణకు సిద్ధమా?.. బీఆర్‌ఎస్‌కు మంత్రి పొంగులేటి సవాల్

by Gantepaka Srikanth |

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని పదే పదే చెబుతున్న బీఆర్‌ఎస్ నాయకులు నిజంగా నిర్దోషులైతే, వెంటనే స్వయంగా సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.

కాళేశ్వరంపై CBI విచారణకు సిద్ధమా?.. బీఆర్‌ఎస్‌కు మంత్రి పొంగులేటి సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని పదే పదే చెబుతున్న బీఆర్‌ఎస్ నాయకులు నిజంగా నిర్దోషులైతే, వెంటనే స్వయంగా సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. కాళేశ్వరం అంశంపై హైకోర్టు “క్లీన్ చీట్” ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. నిజంగా ఎలాంటి అవకతవకలు జరగలేదంటే, స్వతంత్ర సంస్థ ద్వారా విచారణకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని పొంగులేటి డిమాండ్ చేశారు. విచారణ జరిగితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే బీఆర్‌ఎస్ నాయకత్వం వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు. భారీ ఆర్థిక దోపిడీ, కమీషన్ల వ్యవహారం, కాంట్రాక్టుల లోపాలు అన్నీ బహిర్గతమవుతాయనే భయమే వారిని వెంటాడుతోందని మంత్రి అన్నారు. ఇదే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని, విచారణను తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ నాణ్యత దెబ్బతిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఖర్చు చేసిన ప్రతి రూపాయిపై లెక్క చెప్పాల్సిన రోజు దగ్గరలోనే ఉందని, ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

Next Story