అభివృద్ధి–మానవీయతను సమన్వయం చేస్తాం: మంత్రి పొంగులేటి

by Gantepaka Srikanth |

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధికి, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుంద‌ని రాష్ట్ర రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాస‌ రెడ్డి అన్నారు.

అభివృద్ధి–మానవీయతను సమన్వయం చేస్తాం: మంత్రి పొంగులేటి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధికి, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుంద‌ని రాష్ట్ర రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాస‌ రెడ్డి అన్నారు. మూసీ నది పునరుజ్జీవంతో నగరానికి కొత్త జీవం పోసేలా, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ, పునరావాసం తదితర అంశాలపై సచివాలయంలో మంత్రి సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మూసీ నదిని పునరుజ్జీవింపజేసి, దాన్ని పర్యాటకం, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా మార్చాలన్నదే ప్రభుత్వ దూరదృష్టిగా చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదని, ఇది భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన, పర్యావరణహితమైన జీవన వాతావరణాన్ని అందించే సంకల్పమన్నారు. కాలుష్యంతో ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వరదల సమయంలో పరివాహక ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుందని తెలిపారు.

వరద నియంత్రణ, నీటి శుద్ధి, పచ్చదనం పెంపు, రోడ్లు, పార్కులు, వాక్‌వేలు, వినోద కేంద్రాలు ఏర్పాటు ద్వారా మూసి పరివాహక ప్రాంతాలను సరికొత్త జీవన కేంద్రాలుగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టుగా మూసీ ప్రాజెక్ట్ ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గుర్తు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పేదల జీవితాలు దెబ్బతినకుండా ప్రతి నిర్ణయం మానవీయ కోణంలోనే తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టులో భూ సేకరణ ప్రక్రియలో ప్రజల కోణంలో ఆలోచించి మాన‌వీయ కోణంలో నిర్ణయాలు ఉండాలని అధికారులకు సూచించారు. ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాల‌ని ఇందుకు అవ‌స‌ర‌మైన కార్యాచరణ రూపొందించి త‌క్షణ‌మే అమ‌లు చేయాల‌ని ఆదేశించారు. భూములు కోల్పోయే వారికి చట్టబద్ధమైన పరిహారం, అవసరమైన పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ఎటువంటి రాజీ పడబోదని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

Next Story