- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీ+1 తరహాలో ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు గ్రామీణ ప్రాంతాలలో శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాలపైన దృష్టి సారించినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు గ్రామీణ ప్రాంతాలలో శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాలపైన దృష్టి సారించినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లపై బుధవారం మంత్రి సెక్రెటేరియట్‌లోని తన కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ఇరుకు స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు పక్కా ఇంటి వసతిని కల్పించేలా కనీసం 30 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీ ప్లస్ 1 తరహాలో ఇంటిని నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు.
గ్రౌండ్ ఫ్లోర్లో 200 చదరపు అడుగులు మొదటి అంతస్తులో మరో 200 చదరపు అడుగులు నిర్మించుకునేలా ఈ మేరకు జీవో 69 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు పక్కా ఇంటి వసతిని కల్పించాలన్న లక్ష్యంతోపాటు, స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని కొన్ని సడలింపులు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలోని అనేక పట్టణాలు, నగరాల్లోని పేదలు సొంత ఇంటిని నిర్మించుకోడానికి తగిన స్థలం లేక , అరకొర వసతులతో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అటువంటి వారి కోసం ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.
చాలా మంది 60 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలోని రేకుల షెడ్లు, ఇతరత్రా తాత్కాలిక ఏర్పాట్లుతో జీవిస్తున్నారని.. వీరికి ఆర్‌సీసీ స్లాబుతో పక్కా ఇంటిని నిర్మించాలంటే తగిన స్థలం అందుబాటులో లేదని.. ఈ సమస్యను అధిగమించడానికి జీ ప్లస్ 1 నిర్మాణాలకు అనుమతినిస్తున్నట్లు తెలిపారు.
నాలుగు దశల్లో చెల్లింపులు..
మొదటి అంతస్తు రూఫ్ లెవల్ వరకు నిర్మాణం అయితే రూ.లక్ష, ఆ తరువాత గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్ వేసిన తరువాత రూ.లక్ష, ఆపైన ఫస్ట్ ఫ్లోర్‌లో కాలమ్స్, స్లాబ్, గోడల నిర్మాణాలు పూర్తయిన తరువాత రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత మరో లక్ష విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదవాళ్ల ఇంటికోసం ఐదు లక్షల రూపాయిలు ఖర్చు చేయడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఒక ఎత్తు అయితే, పట్టణ ప్రాంతాల్లో మరో ఎత్తు అని, ఇది ప్రభుత్వానికి ఒక సవాల్ అని, ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం ఇలా..
- జీ+1 విధానంలో పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు 96 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 70 అడుగుల విస్తీర్ణంలో వేర్వేరుగా రెండు గదులతోపాటు, కనీసం 35.5 చదరపు అడుగుల్లో వంటగదిని నిర్మించుకోవాలి.
- ప్రతీ ఇంటికి ప్రత్యేకంగా టాయిలెట్, బాత్ రూంలు తప్పనిసరిగా ఉండాలి.
- ఇంటి నిర్మాణం ఆర్‌సీసీ స్లాబ్‌తో ఉండాలి. ఇందుకు సంబంధించిన స్ట్రక్చరల్ డిజైన్లకు డీఈఈ హౌసింగ్ అనుమతి తీసుకోవాలి.






