Bihar Elections: బీహార్ ఎన్నిక‌ల ప్రచారంలో మంత్రి పొంగులేటి.. గెలుపు త‌ధ్యమ‌ని జోస్యం

by Ramesh Naini |

ఎన్డీఏ కూట‌మి పాల‌న‌లో విసిగిపోయిన బీహార్ ప్రజ‌లు మార్పుకోరుకుంటున్నార‌ని కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు, మంత్రి పొంగులేటి శ్రీ‌నివాసరెడ్డి అన్నారు.

Bihar Elections: బీహార్ ఎన్నిక‌ల ప్రచారంలో మంత్రి పొంగులేటి.. గెలుపు త‌ధ్యమ‌ని జోస్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్డీఏ కూట‌మి పాల‌న‌లో విసిగిపోయిన బీహార్ ప్రజ‌లు మార్పుకోరుకుంటున్నార‌ని కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఆర్జేడీ, వామ‌ప‌క్షాలతో స‌మ‌న్వయం చేసుకొని స‌మిష్టిగా ప‌నిచేసి మ‌హాఘ‌ట్‌ బంధ‌న్ గెలుపున‌కు బాట‌లు వేయాల‌ని పిలుపునిచ్చారు. బీహార్ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా శుక్రవారం పశ్చిమ చంపారాన్ జిల్లా, చనుపటియా అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. బీహార్ రాష్ట్ర ఇంచార్జి కృష్ణా ఆళ్వార్‌, ఏఐసీసీ ప‌రిశీల‌కులు బీవీ శ్రీనివాస్, చాణ్‌పాటియా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రమోద్ సింగ్ ప‌టేల్ తో క‌లిసి పార్టీ అభ్యర్ధుల గెలుపుకోసం అనుస‌రించాల్సిన వ్యూహాలు, ఎత్తుగ‌డ‌లు తదితర కార్యాచ‌ర‌ణ‌పై కార్యక‌ర్తల స‌మావేశంలో చ‌ర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 20 ఏళ్ల నితీష్ పాల‌న‌లో బీహార్‌ దిగ‌జారిన అభివృద్ది, కేంద్ర రాష్ట్రాల‌లో న‌రేంద్రమోడీ, నితీష్‌ కుమార్ (Nitish Kumar) పాల‌నా వైఫ‌ల్యాల‌ను ఇంటింటికి తిరిగి ప్రజ‌ల‌కు చేర‌వేయాల‌ని సూచించారు. న‌వంబ‌ర్‌లో జ‌రిగే పోలింగ్‌లో ఎన్డీయే కూట‌మికి ఊహించ‌ని షాక్ ఇవ్వాల‌ని, 14న వెలువడే ఫ‌లితాలతో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని దించాల‌ని మంత్రి పొంగులేటి కోరారు. ఎన్డీఏ దుష్టపాల‌న ప‌ట్ల ఓట‌ర్లలో మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. రెండు ద‌శాబ్దాలుగా బీహార్ ప్రజ‌లు ఎదుర్కొంటున్న ప్రధాన స‌మ‌స్యలు, నిరుద్యోగం, రైతుల ఇబ్బందులు, మ‌హిళల భ‌ద్రత‌, కార్మికుల స్ధితిగ‌తులు, మౌళిక వ‌స‌తుల లోపాలు వంటి వాటిని గుర్తించి వాటికి శాశ్వత ప‌రిష్కారం చూపే దిశ‌గా మ‌హాఘ‌ట్ బంధ‌న్ స్పష్టమైన ప్రణాళిక‌ల‌ను రూపొందించింద‌న్నారు.

బీహార్ అభివృద్ది, ప్రజ‌ల సంక్షేమం ల‌క్ష్యంగా మ‌హాఘ‌ట్ బంధ‌న్ ప‌నిచేస్తుంద‌ని, యువ‌త మ‌హిళ‌లు రైతులు, కార్మికులు అంద‌రూ క‌లిసి మ‌హాఘ‌ట్ బంధ‌న్‌కు చారిత్రాత్మక గెలుపును అందించాల‌ని పిలుపునిచ్చారు. ఇప్పటికే మ‌హాఘ‌ట్ బంధ‌న్ త‌ర‌పున సీఎం అభ్యర్దిగా తేజ‌స్వి యాద‌వ్‌, డిప్యూటీ సీఎంగా స‌హానీ పేర్లను కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ ప్రక‌టించార‌ని తెలిపారు. కానీ ఎన్డీఏ కూట‌మి త‌ర‌పున సీఎం అభ్యర్దిగా ఎవ‌రినీ ప్రక‌టించ‌లేని దుస్ధితిలో ఉన్నార‌ని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. ఇప్పటికే మ‌హాఘ‌ట్ బంధ‌న్ ఎన్నిక‌ల ప్రణాళిక‌, ప్రచారాన్ని చూస్తే ప్రజ‌లు ఈ సారి కొత్తపాల‌న‌ను కోరుకుంటున్నట్లు స్పష్టమైన సంకేతాలు క‌నిపిస్తున్నాయ‌ని, బ‌ల‌మైన అభ్యర్ధులు రంగంలో ఉన్నందున గెలుపు త‌ధ్యమ‌ని మంత్రి పొంగులేటి జోస్యం చెప్పారు

Next Story