నిజాయితీ, సేవాభావంతో పనిచేయండి: మంత్రి పొంగులేటి

by Gantepaka Srikanth |

కష్టపడి సాధించిన గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ల ఉద్యోగాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు సూచించారు.

నిజాయితీ, సేవాభావంతో పనిచేయండి: మంత్రి పొంగులేటి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కష్టపడి సాధించిన గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ల ఉద్యోగాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు సూచించారు. వ్యక్తిగతంగానే కాకుండా ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావాలని, ముఖ్యంగా సమాజంలోని “పూరెస్ట్ ఆఫ్ ది పూర్”కు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలవాలని ఉద్బోధించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 44 మంది గ్రూప్-1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు గురువారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ, ప్రజల సమస్యలకు వెంటనే స్పందించాల్సిన కీలక బాధ్యత రెవెన్యూ శాఖ అధికారులపై ఉంటుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ఛాలెంజ్‌గా స్వీకరించి ముందుకు సాగితే కలిగే సంతృప్తి అమూల్యమని అన్నారు. ఆదర్శవంతమైన సేవలతో భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలవాలని యువ అధికారులకు మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story