- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కడ ఇండ్లిస్తే ఎవరూ తీసుకోవడం లేదు.. అందుకే ఈ నిర్ణయం: మంత్రి పొంగులేటి
పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ గ్రామీణ ప్రాంతాలలో కొలిక్కి వచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాలలోనూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ గ్రామీణ ప్రాంతాలలో కొలిక్కి వచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాలలోనూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణాల్లోని మురికి వాడల్లో జీవనం కొనసాగిస్తున్న పేదలు అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. హైదరాబాద్‌కు దూరంగా గతంలో 42వేల ఇండ్లను నిర్మించగా.. 19 వేల మంది మాత్రమే అక్కడికి వెళ్లారని చెప్పారు. ఇటీవల క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన జరుపగా కేవలం 13 వేల మంది మాత్రమే ఆ నివాసాలలో ఉంటున్నట్లు తేలిందన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పట్టణ ప్రాంతాలలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని మురికి వాడల్లో పేదలు ఉన్నచోటే జీ+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తొలివిడతలో హైదరాబాద్‌లో 16 మురికివాడలను గుర్తించామని.. అలాగే వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, కరీంనగర్ తదితర పట్టణాలలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.
గిరిజనులకు 22 వేల ఇండ్లు..
ఏండ్ల తరబడి నిలువ నీడలేక, తలదాచుకోవడానికి గూడు లేని చెంచులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం, మున్ననూరు ఐటీడీఏ పరిధిలో గల చెంచు, కొలం, తోటి, కొండరెడ్లకు 13,266 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని 16 ఎస్టీ నియోజకవర్గాలకు ఇప్పటికే 8,750 ఇండ్లు మంజూరు చేశామని.. వీటితో కలిపి గిరిజనులకు ఇప్పటివరకు 22,016 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు. తక్షణమే లబ్ధిదారులను గుర్తించి ఇండ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇండ్ల మంజూరు, నిర్మాణంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని.. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదల ఇంటి కోసం రూ.ఐదు లక్షలు ఖర్చు చేయడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.






