- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రెడిటేషన్లే కాదు.. జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి మరో గుడ్‌న్యూస్
దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో అర్హులైన ప్రతీ జర్నలిస్టుకూ అక్రెడిటేషన్లు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో అర్హులైన ప్రతీ జర్నలిస్టుకూ అక్రెడిటేషన్లు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గురువారం జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు పాత్రికేయులకు ఆరోగ్యంతోపాటు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన అక్రెడిటేషన్ కార్డులను ఇప్పటివరకు పొడిగించామని.. దేశంలో, ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఇక్కడ అనుసరించాలన్న ఆలోచన మేరకే కార్డుల జారీలో ఆలస్యం చోటుచేసుకుందన్నారు. గత ప్రభుత్వం 32,500 మందికి అక్రెడిటేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నా 23,352కే పరిమితం చేసిందన్నారు. తమ ప్రభుత్వం ఇప్పుడు సుమారు 46 వేల మందికి పైగా ఇచ్చేలా మార్పులు చేసిందని వెల్లడించారు. ఇప్పటికే సుమారు 2,800 వరకు కార్డులను ఆమోదించడం జరిగిందని వివరించారు.
జర్నలిస్టుల సూచనల మేరకు జీవోలలో మార్పులు చేర్పులు చేశామని.. అర్హులైన వారికి కార్డులు మంజూరు చేయడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. అలాగే.. నేటి నుంచి జిల్లాల్లో కార్డులు పంపిణీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి చెప్పారు. ఈ ప్రక్రియను మే 10వ తేదీని ఒక కటాఫ్ డేట్‌గా పెట్టుకొని దరఖాస్తులు చేసుకోవాలని.. ఆ తేదీలోగా వచ్చే దరఖాస్తులను ఆమోదించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అక్రెడిటేషన్ల సంఖ్య తేలితే జర్నలిస్టులకు ఆరోగ్యం ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఒక ప్రణాళిక రూపొందించుకోవచ్చునని తెలిపారు. అలాగే.. జర్నలిస్టులు ఉద్యోగాలు మారినప్పుడూ అక్రెడిటేషన్లను తమ సంస్థ పేరు మీదకు మార్చుకోవచ్చన్నారు. త్వరలో పాత్రికేయ సంఘాలతో భేటీ అవుతామని తెలిపారు. ఏప్రిల్ 30తో కొంతమంది జర్నలిస్టుల బస్సుపాస్‌ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరో 15 రోజులపాటు పొడిగించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






