Ponguleti: వారికి కూడా రూ.లక్ష ఇస్తాం.. ఇందరమ్మ ఇళ్ళ పై మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్

by Prasad Jukanti |   (  Updated:2025-05-03 06:53:33  IST  )

600 చ.అడుగుల విస్తీర్ణం దాటి నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు.

Ponguleti: వారికి కూడా రూ.లక్ష ఇస్తాం.. ఇందరమ్మ ఇళ్ళ పై మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు 400-600 చ.అడుగుల మధ్యే నిర్మించుకోవాలని అలాంటి వాటికే ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి మండలంలోని ఓ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Indlu) నిర్మాణం చేపట్టామని అయితే కొన్ని ప్రాంతాల్లో 600 చ.అడుగులు దాటి నిర్మించుకుంటున్నారని అలాంటి వాటికి బిల్లులు హోల్డ్ లో పెట్టామన్నారు. అయితే వీటిని పడగొట్టడం కంటే ప్రస్తుతానికి 600 చ.అడుగులు దాటి బేస్ మెంట్ పూర్తయిన ఇళ్లకు ఈ సారికి మినహాయింపు ఇచ్చి రూ.లక్ష రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు మించిన విస్తీర్ణంలో బెస్ మెంట్ వరకు పూర్తయిన ఇళ్లు దాదాపు 300 వరకు ఉన్నాయని వీటికి మిహనహాయింపు ఇస్తామన్నారు. అయితే ఇది కేవలం బేస్ మెంట్ వరకు మాత్రమే మనిహాయింపు ఉంటుందని ఆపై జరిగే బ్రిక్స్ వర్క్ నిబంధనలకు అనుగుణంగా 400-600 చ.అడుగులలోపు నిర్మిస్తేనే మిగతా బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. ఈ మినహాయింపు కేవలం పైలట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అవుతున్న ఇళ్లకు మాత్రమే వర్తిస్తుందన్నారు. న్యాక్ లో శిక్షణ పూర్తి చేసుకున్న 390 మంది అసిస్టెంట్ ఇంజినీర్లకు ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మంత్రిగా నేను ఫోన్ చేసినా ఆ పని చేయొద్దు:

నిజమైన పేదలకే ఇళ్లు కేటాయించాలని దీనిలో మరో మాట లేదని మంత్రి అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి ఇంటిని ట్రాక్ చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను పూర్తి స్థాయిలో వాడుతున్నామని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి నాలుగు దశల్లో బిల్లులు చెల్లిస్తామన్నారు. ప్రతి సోమవారం అర్హులైన లబ్ధిదారులకు బిల్లులు చెల్లించబోతున్నామని చెప్పారు. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చివరకు మంత్రిగా నేను ఫోన్ చేసినా ఫేజ్ ల వారీగా వర్క్ పూర్తి కాకుండా బిల్లుల కోసం సిఫార్సు చేయవద్దని.. ఇంజినీర్లు ఫేజ్-1 నుంచి ఫేజ్ -4 వరకు జాగ్రత్తగా సిఫారసు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలపై టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామని దాని ఫోన్ చేసి వివరాలు చెప్పాలన్నారు. తప్పు జరిగిందని చెబితే చాలు బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. గృహనిర్మాణ శాఖకు మంచిపేరుతేవాలని ఇంజినీర్లకు సూచించారు.

Next Story