ప్రజ‌ల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఉంది.. సహకరించాలని కేంద్రమంత్రి ఖ‌ట్టర్‌కు పొంగులేటి విజ్ఞప్తి

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-24 16:11:23  IST  )

తెలంగాణ ప్రాంత ప్రజ‌ల ఆశ‌లు ఆకాంక్షల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్సరాల‌లో పేద‌ల ఇండ్ల నిర్మాణం జ‌ర‌గలేదు.

ప్రజ‌ల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఉంది.. సహకరించాలని కేంద్రమంత్రి ఖ‌ట్టర్‌కు పొంగులేటి విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రాంత ప్రజ‌ల ఆశ‌లు ఆకాంక్షల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్సరాల‌లో పేద‌ల ఇండ్ల నిర్మాణం జ‌ర‌గలేదు. దీంతో ఇండ్ల నిర్మాణానికి ప్రజ‌ల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన ఇండ్లను మంజూరు చేయాల‌ల‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో మంత్రి పొంగులేటి ఆయనకు స్వాగతం పలికారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి హౌసింగ్‌కు సంబంధించి ప‌లు అంశాల‌ను ప్రస్తావించారు.

''గ‌త ప్రభుత్వం గృహ‌నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. హౌసింగ్ విభాగాన్ని నిర్వీర్యం చేసింది. ఉద్యోగుల‌ను ఇత‌ర శాఖ‌ల‌లో స‌ర్దుబాటు చేసింది. ఈ ప‌రిస్థితుల‌లో ఏడాది క్రితం అధికారంలోకి వ‌చ్చిన తమ ప్రభుత్వం పేద‌ల ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వ‌చ్చే నాలుగు సంవ‌త్సరాల‌లో 20 ల‌క్షల ఇండ్లు నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ‌ను పున‌రుద్ధరించి, అవ‌స‌ర‌మైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జ‌రిగింది. స‌ర్వే ప్రకారం రాష్ట్రంలో అర్హత పొందిన ఇల్లు లేని వ్యక్తులు సుమారు 44 ల‌క్షల వ‌ర‌కు ఉన్నారు. ల‌బ్ధిదారుల అర్హత‌, జియో ట్యాగింగ్‌, వారి ప్రస్తుత నివాసం వంటి విష‌యాల‌ను డాక్యుమెంటేష‌న్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించాం. దీనితో ఇంటింటి స‌ర్వే నిర్వహించాం.

360 డిగ్రీ టూల్‌తో డెస్క్ వెరిఫికేష‌న్ జ‌రిగింది. తుది జాబితాల రూప‌క‌ల్పన కోసం గ్రామ‌ స‌భ‌లు నిర్వహించాం ప్రధాన మంత్రి ఆవాస్ యోజ‌న పేజ్ -1 ప్రకారం దేశ వ్యాప్తంగా రెండు కోట్ల ఇండ్లు మంజూరుకాగా తెలంగాణ‌కు 1.58 ల‌క్షల ఇండ్లు మాత్రమే మంజూర‌య్యాయి. ఇది మొత్తం మంజూరులో 0.79 శాతం. భార‌త దేశ ప‌ట్టణ జ‌నాభాలో తెలంగాణ 8 శాతం క‌లిగి ఉంది. ఈ నేప‌ధ్యంలో తెలంగాణ రాష్ట్రం మ‌రో 24 ల‌క్షల ఇండ్లను పొంద‌డానికి అర్హత క‌లిగి ఉంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజ‌న అర్బన్ ప‌ధ‌కం (2.0) కింద క‌నీసం 20 ల‌క్షల ఇండ్లు మంజూరు చేయాలి'' అని మంత్రి పొంగులేటి కోరారు.

Next Story