- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సల ధరలపై మంత్రి ఆగ్రహం
ప్రైవేటు ఆసుపత్రులలో అవయవ మార్పిడి చికిత్సల ధరలపై మంత్రి దామోదర్ రాజనరసింహా ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సచివాలయంలోని తన కార్యాలయంలో ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ ఆక్ట్ (THOTA) పాలసీ రూపకల్పనపై, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమీక్షలో అవయవ మార్పిడి చికిత్సలపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించారు. అవయవ దానాలను ప్రోత్సహించేందుకు విధివిధానాలను సరళీకృతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అవయవ మార్పిడి చికిత్సలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా కార్యాచరణను రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఆర్గాన్ డొనేషన్స్ యాక్ట్ సమర్థవంతంగా అమలు అయ్యేలా అవసరమైన సమగ్ర పాలసీ రూపకల్పనపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించారు.
ధరల నియంత్రణ ఉండాలి..
ప్రైవేటు ఆసుపత్రులలో అవయవ మార్పిడి చికిత్సల ధరలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు సైతం అవయవ మార్పిడి చికిత్సలకు అయ్యే ఖర్చును భరించే విధంగా ధరల నియంత్రణ ఉండాలని మంత్రి ప్రైవేట్ యాజమాన్యాలకు సూచించారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ చేసిన సూచనలకు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. దాతలు ఇచ్చిన అవయవాలు వృథా కాకుండా ఆస్పత్రులు ప్రత్యేక చర్యలను చేపట్టాలని మంత్రి అన్నారు. ఇతర దేశాల నుండి ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం వచ్చే రోగుల కోసం నూతన విధివిధానాలను రూపొందించాలని అధికారులను మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అవయవ మార్పిడి చికిత్సలకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో చెయ్యి మార్పిడి చికిత్స కోసం 4 ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చామన్నారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ డా. క్రిస్టినా జెడ్ చొంగ్తు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. నరేంద్ర కుమార్, జీవన్ దాన్ డైరెక్టర్ డా. భూషణ్ రాజ్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, ప్రతినిధులు పాల్గొన్నారు.






