పిడుగుపాటుకు గాయపడిన విద్యార్థికి మంత్రి లక్ష్మణ్ అండ

by Muthe.Rajitha |

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపు ఎస్సీ బాలుర వసతిగృహంపై గత నెల పిడుగు పడటంతో 8వ తరగతి విద్యార్థి బొల్లె హిమశ్ చంద్ర తీవ్రంగా గాయపడ్డాడు.

పిడుగుపాటుకు గాయపడిన విద్యార్థికి మంత్రి లక్ష్మణ్ అండ
X

దిశ, తెలంగాణ బ్యూరో : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపు ఎస్సీ బాలుర వసతిగృహంపై గత నెల పిడుగు పడటంతో 8వ తరగతి విద్యార్థి బొల్లె హిమశ్ చంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. టెర్రస్‌పై ఆరేసిన దుస్తులు తీసుకురావడానికి వెళ్లిన హిమశ్‌పై పిడుగు పడింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించి, అతని చేతులు, వెన్ను తీవ్రంగా కాలిపోయాయి.

వసతిగృహ సిబ్బంది వెంటనే బాలుణ్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్ ఆసుపత్రికి, ఆపై పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు.

విద్యార్థి పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థికి మెరుగైన వైద్య సేవలు అందించాలని యశోద వైద్యులకు సూచించారు. మంత్రి పలుమార్లు ఆసుపత్రిని సందర్శించి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యులు నెలరోజుల పాటు చికిత్స అందించి, ప్లాస్టిక్ సర్జరీ చేశారు. చికిత్సకు దాదాపు రూ.18 లక్షలు ఖర్చు అయినా మంత్రి అడ్లూరి మానవతా దృక్పథంతో అండగా నిలబడ్డారు.

మొత్తం వైద్య ఖర్చులను ఎస్సీ సంక్షేమ శాఖ నిధుల నుండి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. హిమశ్ చంద్ర స్వగ్రామం మల్యాల మండలంలోని మద్దుట్ల గ్రామం కాగా... బాలుని తండ్రి బొల్లె శ్రీనివాస్ గల్ఫ్ లో కూలీగా పనిచేస్తున్నారు. మంత్రి చొరవతోనే తన కుమారునికి సరైన చికిత్స అంది కోలుకున్నాడంటూ శ్రీనివాస్ మంత్రి లక్ష్మణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story