KTR అలక.. బీఆర్ఎస్‌ కీలక ప్రోగ్రామ్స్‌కు దూరం?

by Disha Web Desk 2 |
KTR అలక.. బీఆర్ఎస్‌ కీలక ప్రోగ్రామ్స్‌కు దూరం?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు అన్నీ తానై పార్టీ ప్రొగ్రామ్స్‌లో పాల్గొనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ మార్పుపైనా ఆయన అయిష్టంగా ఉన్నారనే టాక్ వినిపిస్తున్నది. అందుకే పార్టీ కార్యక్రమాలకు పోవడంలేదనే చర్చలు నడుస్తున్నాయి. పార్టీ పేరు మార్పు ను మెజారిటీ లీడర్లు జీర్ణించుకోవడం లేదనేది టాక్. తెలంగాణ సెంటిమెంట్ నుంచి పార్టీ దూరం అవుతుందని ఆందోళన వారిని వెంటాడుతున్నది. భవిష్యత్ లో మనుగడ కష్టమనే భయమూ పట్టుకున్నది.

అందుకనే మంత్రి కేటీఆర్ కూడా దూరంగా ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించే సమయంలో రాష్ట్రంలో బలహీనపడుతున్నట్టు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు బీజేపీ రోజురోజుకు బలపడుతున్నది. ఇలాంటి టైమ్ లో పార్టీని బలోపేతం చేయకుండా ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరించడంపై ఫోకస్ పెట్టడం సరైంది కాదనే అభిప్రాయంలో కేటీఆర్ ఉన్నట్టు తెలిసింది.

ఖమ్మం సభకు డుమ్మా?

ఈనెల 18న బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఖమ్మంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. దీనికి సుమారు 5 లక్షల మందిని తరలించేందుకు కసరత్తు జరుగుతున్నది. అయితే మంత్రి కేటీఆర్ సభకు హాజరవడం కష్టమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే.. ఆయన ఈనెల 14న స్విట్జర్లాండ్ కు వెళ్తున్నారు. అక్కడే వారం రోజులు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని 20న తిరిగి రానున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే సభకు దూరంగా ఉండేందుకే స్విట్జర్లాండ్ టూర్ ను ఆయన ఫిక్స్ చేసుకున్నట్టు ప్రచారంలో ఉంది.

ఆ రోజు తెలంగాణ భవన్ లోనూ..

ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ఓపెనింగ్‌కూ కేటీఆర్ వెళ్లలేదు. డిసెంబరు 9న జరిగిన కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ లీడర్లు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. అక్కడే మూడు రోజులు ఉన్నారు. కానీ కేటీఆర్ అదేరోజు హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీతో అధికారిక అగ్రిమెంట్ ముందే ఉందనే కారణంతో వెళ్లలేదు. పార్టీ విస్తరణలో భాగంగా ఏపీ లీడర్లు ఈనెల 2న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లో చేరారు. అక్కడ కూడా కేటీఆర్ కనిపించలేదు. అయితే ఆయన ఎందుకు రాలేదు? కీలకమైన ఇతర పనులు ఉండే రాలేదా?అని చర్చ ఆరోజు మీటింగ్ కు హాజరైన లీడర్లు మధ్య జోరుగా చర్చ జరిగింది.

ఒకే వేదికపై కనిపించని తండ్రి కొడుకులు

పార్టీ పేరు మార్పు తర్వాత సీఎం కేసీఆర్ తో కలిసి కేటీఆర్ ఇంతవరకు ఏ పార్టీ ప్రొగ్రామ్ లో కనిపించలేదు. కావాలనే కీలకమైన పొగ్రామ్స్ కు కేటీఆర్ డుమ్మా కొడుతున్నట్టు ప్రచారంలో జరుగుతున్నది. తన అసంతృప్తిని తెలియచేసేందుకే ఇలా చేస్తున్నారా ? అనే చర్చ కూడా ఉంది. అయితే పార్టీ పేరు మార్పు, వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కార్యక్రమాలు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకే కేసీఆర్ ఇలా చేస్తున్నట్టు వాదనలు కూడా ఉన్నాయి.

బీఆర్ఎస్ ఆరో వేలు?

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు పార్టీ పేరు మార్పును మెజార్టీ లీడర్లు తమ అంతర్గత సమావేశాల్లో సెటైర్లు వేసుకుంటున్నట్టు తెలిసింది. పార్టీలో తెలంగాణ పదం తీసేసినప్పుడే కౌంట్ డౌన్ మొదలైందని ఆవేదన చెందుతున్నారు. ''బీఆర్ఎస్ తమకు ఆరో వేలుగా ఉంటుందే తప్ప.. తమ రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడదు".. కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులు, అరెస్టులప్పుడు కాస్త పనికొస్తుందేమో'' అని ఉద్యమకారుడైన ఓ ఎమ్మెల్యే ఆవేదన చెందారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పేరు మార్పుపై పాజిటివ్ లేదని ఓ ఉద్యమకారుడైన మంత్రి అభిప్రాయపడ్డారు.

Read more:

BRS ఖమ్మం సభకు ఆంధ్రా జనం.. ఇద్దరు మంత్రులకు బాధ్యతలు అప్పగింత

Next Story

Most Viewed