చిన్న చిన్న అంశాల‌కు గిరిజ‌నుల‌ను ఇబ్బంది పెట్టొద్దు.. ఫారెస్ట్ అధికారులకు మంత్రుల ఆదేశం

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-24 13:09:46  IST  )

అట‌వీ ప్రాంతాల‌ అభివృద్ధికి ఫారెస్టు డిపార్టుమెంట్ ఉన్నతాధికారులు, డీఎఫ్ఓలు స‌హ‌క‌రించాల‌ని రాష్ట్ర అట‌వీ ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ఆదేశించారు.

చిన్న చిన్న అంశాల‌కు గిరిజ‌నుల‌ను ఇబ్బంది పెట్టొద్దు.. ఫారెస్ట్ అధికారులకు మంత్రుల ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: అట‌వీ ప్రాంతాల‌ అభివృద్ధికి ఫారెస్టు డిపార్టుమెంట్ ఉన్నతాధికారులు, డీఎఫ్ఓలు స‌హ‌క‌రించాల‌ని రాష్ట్ర అట‌వీ ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ఆదేశించారు. అట‌వీ సంర‌క్ష‌ణ‌... గిరిజ‌నుల అభివృద్ధి రెండూ అనివార్యమేన‌ని అన్నారు. నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ... అట‌వీ ప్రాంత ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్ట‌కుండా ఫారెస్టు అధికారులు చూడాల‌న్నారు. మంత్రి సీతక్క(Minister Seethakka)తో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై మంత్రి కొండా సురేఖ తెలంగాణ స‌చివాల‌యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ స‌మావేశంలో ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌కవ‌ర్గాల్లో ఉన్న స‌మ‌స్య‌లను మంత్రుల‌కు వివ‌రించారు. మంత్రి సురేఖ స్పందిస్తూ... గిరిజనుల బ‌తుకులు మారాలంటే ఆయా ప్రాంతాల అభివృద్ధి జ‌ర‌గాల‌ని అన్నారు. స‌మావేశంలో ఎమ్మెల్యేలు, వెడ్మా బొజ్జూ, కోవా ల‌క్ష్మీ, డాక్ట‌ర్ పాల్వాయి హ‌రీష్ బాబు మాట్లాడుతూ.. అంగ‌న్వాడీలు, స్కూల్ భ‌వ‌నాలు, ఇండ్లు క‌ట్టుకోవ‌డానికి కూడా ఫారెస్టు అధికారులు ఇబ్బందులు పెడుతున్నార‌ని చెప్పగా.. ఆయా ప్రాంతాల్లోని డీఎఫ్ఓల‌కు ఈ స‌మ‌స్య‌లు వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఉన్న‌వాటిని ప‌రిష్క‌రించాల‌ని.. ఏదైనా ఉంటే త‌మ దృష్టికి తీసుకురావాల‌ని సూచించారు. వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ, అట‌వీ భూమి ప‌రిర‌క్ష‌ణ అవ‌స‌మేన‌ని... కానీ, అట‌వీ ప్రాంత‌ ప్ర‌గ‌తి కూడా అనివార్య‌మ‌న్నారు. ఇక ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్ మాట్లాడుతూ... త‌మ ప్రాంతంలో రోడ్లకి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డం లేద‌ని దాంతో రాక‌పోక‌లు ఇబ్బంది అవుతున్న‌ద‌ని చెప్పారు. ఈ విష‌యంపై ఇచ్చిన ప్ర‌తిపాద‌న‌లు, వ‌ర్క్ సాంక్ష‌న్ వివ‌రాలు త‌మ వెంట‌నే అంద‌జేయాల‌ని సంబంధిత డీఎఫ్ఓను మంత్రి సురేఖ ఆదేశించారు. అట‌వీ ప్రాంతాల్లో గిరిజ‌నులు బోర్లు వేసుకుంటే ఎక్క‌డిక్క‌డ ఇబ్బందులు పెడుతున్నార‌ని ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు మంత్రి సురేఖ దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలు నివేదించిన ప‌నుల మీద అధికారులు పరిష్కారం దిశ‌గా కృషి చేయాల‌న్నారు మంత్రి కొండా సురేఖ. వాటిని మ‌రొక‌సారి ప‌రిశీలించి త‌గు నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు.

స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3 వారీగా ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని మంత్రి సురేఖ చెప్పారు. స్టేజ్-1లో(వెంట‌నే అయ్యే ప‌నుల) గురించి రెండు, మూడు రోజుల్లో ఒక ప్ర‌త్యేక‌ నివేదిక అందజేయాలని ఆదేశించారు. అటవీ శాఖ కఠిన నిబంధనల వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అటవీ సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సురేఖ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకువ‌చ్చారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాలు చూపించాలనే ఉద్దేశంతో అట‌వీ శాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, రోడ్ట్లు భవనాల శాఖ, ఐటీడీఏ శాఖలతో శ‌నివారం సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన‌ట్టు మంత్రి చెప్పగా వారు త‌మ స‌మ‌స్య‌లు వివ‌రించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను విస్తృతంగా చ‌ర్చించి, ఒక పరిష్కార మార్గాన్ని చూపించాల‌ని అట‌వీ అధికారుల‌ను మంత్రి సురేఖ ఆదేశించారు. గిరిజ‌నుల అభివృద్ధికి అటవీ శాఖ ఉన్న‌తాధికారులు సహకరించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కనీసం సౌకర్యాలైన రోడ్లు, ఆస్పత్రులు, పాఠశాలలు, అంగ‌న్వాడీలు, తాగునీరు, కరెంటు లైన్లు ఏర్పాటుకు సహకారం అందించాల‌న్నారు. అట‌వీ చట్టాలపేరు మీద ప్రజలను ఇబ్బందులకు గురి చేయ‌వ‌ద్ద‌ని సూచించారు. సరైన రోడ్లు లేకపోవడం వల్ల ఆపత్కాలంలో అంబులెన్సులు కూడా వెళ్లలేక పోతున్నాయని మంత్రి సురేఖ, సీత‌క్క‌లు ఆవేదన వ్య‌క్తం చేశారు. అడవుల సరిహద్దుల్లో ఉండాల్సిన చెక్ పోస్టులు... గ్రామాల్లో ఏర్పాటుచేసి ఇబ్బందులు పెడుతున్నార‌ని ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చార‌న్నారు. తాము పంపే రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలను పెండింగులో పెట్ట‌డం స‌రికాద‌ని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బ‌ట్టి అనుమతులు ఇవ్వకుండా కావాలనే త‌మ ఫైళ్లని అటవీ అధికారులు పెండింగ్లో పెడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దాంతో, అభివృద్ధి కుంటుపడుతోందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని అటవీ చట్టాలు చెబుతున్నాయ‌ని, 1980 కంటే ముందు ఉన్న పల్లెల్లో రహదారులుంటే... అవి పాడైతే అక్కడ మరమ్మతులు చేపట్టవచ్చని, అవసరమైన చోట కొత్త రహదారులు నిర్మించవచ్చని అటవీ చట్టాలు చెబుతున్నాయన్నారు. అయినా అటవీ అధికారులు ఎందుకు అభ్యంతరాలు చెబుతున్నారని అడ‌గ్గా... ఎమ్మెల్యేలు లేవ‌నెత్తిన అంశాల‌కు సవివ‌రంగా సమాధానాలు తెలుపాల‌ని మంత్రి అన్నారు. అటవీ శాఖ నిబంధనలు అడ్డుగా ఉంటే.. చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు తెప్పించాల‌ని సూచించారు. అట‌వీ మీద ఆధారపడ్డ ఆదివాసీ గిరిజనులు అట‌వీ ఉత్పత్తులు సేకరించవచ్చని అటవీ చట్టమే స్ప‌ష్టం చేస్తుంద‌న్నారు. అయినా తునికాకు, ఇప్ప‌పువ్వు, పండ్ల సేకరణకు వెళ్లిన ఆదివాసీలను... గిరిజనులను ఎందుకు ఇబ్బందులు పాలు చేస్తున్నారని అట‌వీ అధికారుల‌పై మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అట‌వీ ఉత్ప‌త్తులు సేక‌రించ‌డం గిరిజ‌నుల‌కు ఉన్న హ‌క్కు అని... కేవ‌లం వాటి కోసం అడ‌విలోకి వ‌చ్చేవారిని ఇబ్బంది పెట్టొద్ద‌ని చెప్పారు. నిబంధనలకు లోబడే అధికారులు వ్యవహరించాలని చెప్పారు. అటవీ భూమిని పరిరక్షించాల‌ని, అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలన్నారు. ఈ రెండింటినీ సమన్వయం చేసేలా అన్ని శాఖ అధికారులు వ్యవహరించాలన్నారు మంత్రి కొండా సురేఖ.

మంత్రి సురేఖ‌, సీత‌క్క‌ల‌కు ఆదిలాబాద్ ఎమ్మెల్యేల ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు

తెలంగాణ రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌ల‌కు అట‌వీ ప్రాంత ఎమ్మెల్యేలు వెడ్మా బొజ్జు, కోవా లక్ష్మీ, పాల్వాయి హరీష్, అనిల్ జాదవ్, ఎంఎల్సీ దండే విఠల్ ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌మ అట‌వీ ప్రాంతాల్లోని స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు అటవీ శాఖ ప్రిన్స్ ప‌ల్ సెక్ర‌ట‌రీ అహ్మ‌ద్ న‌దీమ్‌, పీసీసీఎఫ్ డాక్ట‌ర్ సువ‌ర్ణ‌, సీసీఎఫ్, డీఎఫ్ఓలతో మీటింగ్ ఏర్పాటు చేసి స‌మ‌న్వ‌య ప‌రిచినందుకు థ్యాంక్స్ చెప్పారు. త‌మ ప్రాంత‌ స‌మ‌స్య‌ల‌పై మంత్రి సురేఖ‌, సీత‌క్క‌లు సానుకూలంగా స్పందిస్తున్నార‌ని స‌మావేశంలో మాట్లాడారు. ఎక్క‌డ అట‌వీ శాఖ అధికారుల‌తో త‌మ‌కు స‌మ‌న్వ‌య లోపం వ‌చ్చినా మంత్రి సురేఖకి చెబితే త‌మ‌కు స‌హ‌కారం అంద‌జేస్తున్నార‌ని ఎమ్మెల్యేలు పున‌రుద్ఘాటించారు.

Next Story