- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ.. నియంత్రణకు మంత్రి కొండా సురేఖ 5 R రూల్
యావత్ ప్రపంచానికే సవాలుగా మారిన ప్లాస్టిక్ మహమ్మారి నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు సంయుక్త కృషి అవసరం అని మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: యావత్ ప్రపంచానికే సవాలుగా మారిన ప్లాస్టిక్ (plastic) మహమ్మారి నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు సంయుక్త కృషి అవసరం అని మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) అభిప్రాయపడ్డారు. అందరం కలిసి మన పర్యావరణాన్ని రక్షించుకోవాలని, సంరక్షించుకోవాలనే బాధ్యతను ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఇవాళ (గురువారం) హైదరాబాద్‌లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. ఈ ఏడాది ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అంతం చేయడం’ అనే థీమ్ తో ఈ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నమని గుర్తు చేశారు. నేడు మన రాష్ట్రం, దేశమే కాకుండా యావత్ ప్రపంచమంతా ప్లాస్టిక్ సమస్యను పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నదని అన్నారు. అందుకే, ప్లాస్టిక్ కాలుష్యం నిర్మూలన వైపు మనమంతా ద్రుష్టిసారించాల్సిన అవసరం ఉన్నదన్నారు. 1960, 1970ల నుంచి సముద్రాలలో ప్లాస్టిక్ పెద్ద ఎత్తున పేరుకుపోతున్నట్లు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. నీటిలో జీవ వైవిధ్యానికి, ఆహార భద్రతకు ఈ ప్లాస్టిక్ ప్రమాదంగా మారుతోందన్నారు. భారత్ ప్రతి ఏడాది సుమారు 12.65 కోట్ల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోందని నిపుణులు చెబుతున్నారన్నారు. ప్రతి నిమిషం ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 లక్షల సింగిల్-యూస్ ప్లాస్టిక్ సంచులు పంపిణీ అవుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు.
నిమిషానికి 10 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లు కొనుగోలు అవుతున్నాయని, 2026 నాటికి ఈ సంఖ్య 50 కోట్లకు పైగా ఉంటుందని మన పర్యావరణ శ్రాస్తవేత్తలు అంచనా వేస్తున్నారన్నారు. ప్రతి ఏడాది 80 లక్షల నుంచి 120 లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతోందని తెలిపారు. 1950ల నుంచి ఇప్పటివరకు 830 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయిందన్నారు. అందులో సుమారు 500 కోట్ల టన్నులు పర్యావరణ కాలుష్యంగా మారాయన్నారు. ఇదే ధోరణి కొనసాగితే, 2050 నాటికి ఈ సంఖ్య 1200 కోట్ల టన్నులకు చేరవచ్చని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని సృష్టించేందుకు కట్టుబడి ఉందన్నారు. ఈ రోజు కొన్ని మంచి నిర్ణయాలతో ప్లాస్టిక్ నివారణలో ముందంజలో ఉంటామని మరోసారి ప్రతిజ్ఞ చేస్తున్నామని మంత్రి సురేఖ చెప్పారు. కాగా, 2018లో, భారత్ 2022 నాటికి సింగిల్-యూస్ ప్లాస్టిక్‌లను తొలగించాలని ప్రతిజ్ఞ చేసిందనీ మంత్రి వెల్లడించారు. తెలంగాణ ఈ నిర్ణయం, విధానాన్ని మరింత ఉత్సాహంతో కొనసాగిస్తోందన్నారు. ఈ ఏడాది ఆగస్టు-2025లో జెనీవాలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి యావత్ ప్రపంచమంతా కీలక చర్చలు జరపనున్నదన్నారు. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆతిథ్యం ఇస్తున్న రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ప్లాస్టికును మరింత వేగంగా నిలువరించేందుకు వ్యూహాలు రచించనున్నదన్నారు. అయితే, మనం 5Rలను—రిఫ్యూజ్ (తిరస్కరించాలి), రెడ్యూస్ (తగ్గించాలి), రీయూజ్ (పునర్వినియోగించాలి, రీసైకిల్ (పునఃచక్రీకరణ), రీథింక్ (పునరాలోచన)—పాటించాలన్నారు.
తెలంగాణలో ప్లాస్టిక్ రహిత ప్యాకేజింగ్‌ను వినియోగిస్తున్న చేస్తున్న స్టార్టప్‌లు, పరిశ్రమలను తమ ప్రజా ప్రభుత్వం సమర్థిస్తున్నదన్నారు. మొక్కల ఆధారిత ప్లాస్టిక్‌లు, పునర్వినియోగ కంటైనర్‌లు ఇందులో భాగంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రతి పౌరుడినీ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలనీ, రీసైక్లింగ్‌కు సహకరించాలని ఆ శాఖ మంత్రిగా కోరుతున్నట్టు సురేఖ చెప్పారు. బయోడీగ్రేడబుల్ ప్యాకేజింగ్, ప్లాంట్ ఆధారిత ప్లాస్టిక్‌ను సపోర్ట్ చేద్దామన్నారు.






