- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడ పెరుగుతున్న జన సందోహమే దానికి నిదర్శనం.. మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యం కొండ వెంకటేశ్వర స్వామి జాతర విశిష్టత గురించి ప్రత్యేకంగా రూపకల్పన చేసిన వీడియోను తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) గురువారం ఆవిష్కరించారు.

దిశ, వెబ్‌డెస్క్: మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యం కొండ వెంకటేశ్వర స్వామి జాతర విశిష్టత గురించి ప్రత్యేకంగా రూపకల్పన చేసిన వీడియోను తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) గురువారం ఆవిష్కరించారు. ప్రముఖ దర్శకులు, గద్దర్ అవార్డ్స్ కమిటీ సభ్యుడు, ఉత్తమ దర్శకుడు నంది అవార్డు గ్రహీత అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో, ఫిల్మ్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై సాయి తేజ నిర్మించిన వీడియో చిత్రం 'మన మన్యంకొండ'(Mana Manyamkonda) వీడియోను సచివాలయంలోని తన పేషీలో మంత్రి విడుదల చేశారు. "మహిమగల మన్యం, దర్శిస్తేనే పుణ్యం " అని తెలుగు ప్రజలు విశ్వసించే మన్యంకొండ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ఈ శుభ సందర్భంగా ఈ వీడియో చిత్రం ఆవిష్కరణ రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా వైభవంగా జరిగింది.
మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నెన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయని, వాటి వైభవోపేతమైన చరిత్రను, స్థల పురాణాన్ని, ప్రజల విశ్వాసాలను అందరికీ చేరేలాగా ప్రచారం జరగాలని అందుకు ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి చెప్పారు. సమాజం ఉత్తమ విలువలతో ముందుకు సాగాలంటే, ధార్మిక చింతన కలిగించే ఇటువంటి చిత్రాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని ఆమె ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా దేవాదాయ శాఖ మన తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకు ఆలయాల సందర్శనకు పెరుగుతున్న జన సందోహమే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ఎంతో బిజీగా ఉన్నా ఈ వీడియో ఆవిష్కరణకి సమయం ఇచ్చి ప్రోత్సహించినందుకు తమ యూనిట్ తరఫున దర్శకుడు అల్లాణి శ్రీధర్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, దేవాలయాలపై ఎంతో శ్రమకోర్చి వీడియో తీసిని శ్రీధర్ ను మంత్రి సురేఖ ప్రత్యేకంగా అభినందించారు. శాలువా కప్పి సన్మానించారు.






