ఆ తపనతోనే YS రాజశేఖరరెడ్డి స్టార్ట్ చేశారు.. మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

వినికిడి సమస్య(Hearing Problem)ను సాంకేతికతతో అధిగమిద్దామని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చెప్పారు. ఒక శబ్ధాన్ని వినగల్గడం అనేది భగవంతుడు మన అందరికీ ఇచ్చిన గొప్ప వరమ‌ని ఆమె పేర్కొన్నారు.

ఆ తపనతోనే YS రాజశేఖరరెడ్డి స్టార్ట్ చేశారు.. మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వినికిడి సమస్య(Hearing Problem)ను సాంకేతికతతో అధిగమిద్దామని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చెప్పారు. ఒక శబ్ధాన్ని వినగల్గడం అనేది భగవంతుడు మన అందరికీ ఇచ్చిన గొప్ప వరమ‌ని ఆమె పేర్కొన్నారు. కానీ, కొన్ని ప్రత్యేక సమస్యలు వల్ల మన సమాజంలోనే కొంతమంది వినికిడి లోపాన్ని కలిగి ఉంటున్నారని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమ‌ని వ్యాఖ్యానించారు. అయితే, అటువంటి వారికి మనమంతా అండగా నిలిచి.. సహకరించాల్సిన అవసరం చాలా ఉంద‌ని మంత్రి నొక్కి చెప్పారు. ఎందుకంటే, ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో వినికిడి లోపమనే సమస్య కూడా చాలా ప్రధానమైనద‌ని చెప్పారు. ఈ సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా మన దేశంలోనూ ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ప్రపంచ జనాభాలో 5% కంటే ఎక్కువ మందికి (సుమారు 43 కోట్లు) వినికిడి లోపంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయ‌ని స్పష్టం చేశారు.

2050 నాటికి 70 కోట్లకు పైగా వ్యక్తులు, లేదా ప్రతి పది మందిలో ఒకరు, వినికిడి లోపంతో బాధపడుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలు వెల్ల‌డిస్తున్న‌ట్టు వివ‌రించారు. సోమవారం ప్రపంచ వినికిడి దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ ఈఎన్‌టీ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ పోస్టర్‌ను ఆవిష్కరించి, శస్త్ర చికిత్సను విజయవంతం చేసుకున్న చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి అనంతరం వైద్యులను సత్కరించి, ప్రసంగించారు. సాధారణంగా చెవి వ్యాధుల చుట్టూ ఉన్న అపోహలు తొలగించేందుకు నడుం బిగించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. వినికిడి లోపానికి గల అనేక కారణాలను సరైన జాగ్రత్తతో నివారించవచ్చని చెప్పారు. వినికిడి లోపం ఉన్నవారికి సకాలంలో, తగిన మేరకు చికిత్స చేయించుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయవచ్చ‌ని చెప్పారు.

సరైన చర్యలు తీసుకుంటే బాల్యంలో కనీసం 60% వినికిడి లోపాన్ని నివారించవచ్చని అన్నారు. దీనికి కావాల్సిందల్లా అవగాహన మాత్రమేన‌ని చెప్పారు. మా ఇ.ఎన్.టి లో 700 పైగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేయ‌డం హ‌ర్ష‌ణీయం అన్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రజలకు సేవ చేసే ప్రయత్ననికి ప్రభుత్వ సహకారం ఎప్పుడు ఉంటుదని తెలంగాణ రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఏ వ్యాధికైనా ముందస్తూ వైద్య పరీక్షలు చేయించుకోవాలనీ దీనికి ప్రభుత్వ,ప్రైవేటు రంగాలకు సంబంధించిన వారితో పాటు స్వచ్ఛంద సంస్థలు సహకారం తీసుకుని అవగాహన కల్పిస్తూ,ఈ వ్యాధిని నియంత్రణకూ కలసి కట్టుగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే మానవతా దృక్పథంతో ఆలోచించి రూపాయికే వైద్యం అందించే వైద్యునిగా పేరుపొందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekhara Reddy) ప్రజలకూ ఇవే వైద్య సేవలు అందలానే తపనతో ఆరోగ్యశ్రీకి శ్రీకారం చుట్టారని గుర్తు చేస్తూ, ఈ శస్త్ర చికిత్స విధానం అందరికీ అందాలనే అంశంపై మంత్రివర్గంతో పాటు సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో కూడా చర్చిస్తానని ఆరోగ్యశ్రీలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని విషయాన్ని ప్రస్తావిస్తానని మంత్రి తెలిపారు. కాగా, ఈ కార్య‌క్ర‌మంలో మా ఈఎన్టీ గ్రూప్ చైర్‌పర్సన్ సునీత కుమార్ ఆసుప‌త్రి ఎండీ మేఘనాథ్, ఈఎన్టీ ఆసుప్ర‌తి వైద్యులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story