- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తుల విశ్వాసాలను అనుగుణంగా ఆలయాలను నిర్వహించాలి
భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా దేవాలయాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత దేవాదాయశాఖ అధికారులపై ఉన్నదని మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు.

భక్తుల విశ్వాసాలను అనుగుణంగా ఆలయాలను నిర్వహించాలి
సీఎం ఆశయాల మేరకు దేవాదాయ శాఖను తీర్చిదిద్దాలి
దేవాలయాల పట్ల భక్తుల్లో నమ్మకం మరింత బలపడేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
దేవాలయాల నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం, అవినీతి వంటివి దృష్టికి వస్తే తీవ్ర చర్యలు
దేవాదాయశాఖ సమీక్షా సమావేశంలో మంత్రి కొండా సురేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా దేవాలయాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత దేవాదాయశాఖ అధికారులపై ఉన్నదని మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. కోట్లాది రూపాయల నిధులతో రాష్ట్రంలోని దేవాలయాలను వైభవోపేతంగా తీర్చిదిద్దే దిశగా సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ప్రతి అధికారి అంకితభావంతో పనిచేయాలని మంత్రి సురేఖ ఆదేశించారు. బంజారా హిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని క్యాంపు కార్యాలయంలో దేవాదాయశాఖపై మీడియాలో వచ్చిన ప్రతికూల కథనాలపై మంత్రి సురేఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంత రావు, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, దేవాదాయశాఖకు చెందిన పలువురు ఇతర ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖకు సంబంధించిన అంశాలపై గత సంవత్సరం కాలంగా వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వేదికల్లో వచ్చిన వార్తలు, కథనాలు, ప్రజా అభిప్రాయాలను ఈ సమావేశం విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా దేవాలయాల నిర్వహణ, భక్తుల నమ్మకాలు, వారికి అందుతున్న సేవలు, దేవాలయ ఆస్తుల పరిరక్షణ, పారదర్శకత, ఆలయ ఆదాయాల వినియోగం, సిబ్బంది పనితీరు వంటి అంశాలపై మీడియాలో వచ్చిన ప్రతికూల వార్తలను ఉన్నతాధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఆయా అంశాలపై ఇప్పటికే శాఖాపరంగా తీసుకున్న చర్యల పురోగతిని అధికారులు మంత్రి సురేఖకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, దేవాదాయ శాఖ ప్రజల విశ్వాసాలకు ప్రతీకగా నిలపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దేవాలయాల పట్ల భక్తుల్లో నమ్మకం మరింత బలపడేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మీడియాలో వచ్చిన కథనాలపై దృష్టి సారించి, లోపాలు ఎక్కడ ఉన్నా వెంటనే సరిదిద్దాలని అధికారులకు సూచించారు. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవల నాణ్యతను పెంచాలని, ప్రసాదాల నాణ్యత, ఆలయాల పరిశుభ్రత, భద్రత, సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. దేవాదాయ శాఖపై ప్రజల్లో సానుకూల భావన పెరిగేలా అధికారులు క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి అధికారి తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తూ దేవాదాయశాఖ ప్రతిష్టను కాపాడే దిశగా కృషి చేయాలని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం దేవాదాయ శాఖ ప్రధాన బాధ్యత అని, అందుకు అనుగుణంగా పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
దేవాలయాల నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం, అవినీతి వంటివి తన దృష్టికి వస్తే తీవ్ర చర్యలుంటాయని మంత్రి సురేఖ హెచ్చరించారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో ఆలయ నిర్వహణ, విధుల పట్ల ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా భారీగా ఫిర్యాదులు రావడంతో తాను స్వయంగా తనిఖీ చేసి, పలువురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. అలాగే బాగా పనిచేసే అధికారులకు ఎప్పటికైనా తగిన ప్రశంసలు దక్కుతాయని మంత్రి స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసేలా దేవాలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దాల్సన బాధ్యత అధికారుల పై వుందని మంత్రి సురేఖ తేల్చి చెప్పారు. ప్రస్తుతం సరస్వతీ అంత్య పుష్కరాల నేపథ్యంలో పుష్కరాల నిర్వహణ తీరును మంత్రి సురేఖ అధికారులను అడిగి వివరంగా తెలుసుకున్నారు. పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లు, ఘాట్‌ల పరిశుభ్రత, భద్రతా చర్యలు, తాగునీరు, వైద్య శిబిరాలు, పార్కింగ్, రవాణా సదుపాయాలు తదితర అంశాలపై అధికారులు మంత్రికి వివరించారు. అలాగే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. సరస్వతీ అంత్య పుష్కరాలు ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచేలా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.






