వారి చిర‌కాల కోరిక‌ను నేర‌వేర్చిన మంత్రి సురేఖ

by Gantepaka Srikanth |

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాయాల‌యాల్లో ప‌నిచేస్తున్న అర్చకుల(Telangana Priests) చిర‌కాల కోరిక‌ను దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) నెరవేర్చారు.

వారి చిర‌కాల కోరిక‌ను నేర‌వేర్చిన మంత్రి సురేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాయాల‌యాల్లో ప‌నిచేస్తున్న అర్చకుల(Telangana Priests) చిర‌కాల కోరిక‌ను దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) నెరవేర్చారు. అన్ని ఆల‌యాల్లో సుదీర్ఘ కాలంగా సేవ‌లు అందిస్తున్న అర్చక‌, ఉద్యోగ సంక్షేమ నిమిత్తం ప్ర‌త్యేకంగా నిధిని ఏర్పాటు చేశారు. సోమ‌వారం మంత్రి కొండా సురేఖ‌, ఎండోమెంట్ ప్రిన్స్‌ప‌ల్ సెక్ర‌ట‌రీ శైల‌జా రామ‌య్య‌ర్‌, డైరెక్ట‌ర్ వెంక‌ట‌రావు తదిత‌ర అధికారుల‌తో అర్చ‌క, ఉద్యోగ సంక్షేమ నిధి పోస్ట‌రును రిలీజ్ చేశారు. అనంత‌రం మంత్రి సురేఖ మాట్లాడుతూ.. అర్చ‌క‌, ఉద్యోగుల కోసం త‌మ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని వివ‌రించారు. ఈ సంక్షేమ ట్రస్టు ద్వారా దేవాదాయ శాఖ పరిధిలోని సహాయ కమిషనర్ స్థాయి వరకు గల దేవాలయాలలో పని చేసే సుమారు 13,700 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులకు ల‌బ్ధి చేకూరుతుంద‌ని ఆమె వ్యాఖ్యానించారు. అర్చకులు, ఇతర ఉద్యోగులకు మరణానంతరం లేదా రిటైర్మెంట్ గ్రాట్యూటి ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

ధూపదీప నైవేద్య అర్చకులకు మరణానంతరము చెల్లించు గ్రాట్యూటి నిర్ధారించిన‌ట్టు చెప్పారు. మరణానంతరము చెల్లించు ఎక్స్ గ్రేషియా, అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తము చెల్లింపు ఈ నిధి ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. ఈ నిధి కింద ఉద్యోగుల‌కు.. మెడికల్ రీయింబ‌ర్స్ మెంట్‌, వివాహ నిమిత్త పథకం, ఉపనయన పథకం, గృహ నిర్మాణ, కొనుగోలు మరియు మరమ్మత్తుల నిమిత్త పథకం, విద్యా పథకం, విధులు నిర్వహించలేని వికలాంగులైన ఉద్యోగులకు ఆర్థిక సహాయ పథకం అంద‌జేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

పైన పేర్కొన్న పథకాలలో రెగ్యులర్ అర్చకులు, ఇతర ఉద్యోగులకు మరణానంతరము లేదా రిటైర్మెంట్ గ్రాట్యూటి పథకానికి 28.05.2025 రోజున అర్చక సంక్షేమ బోర్డు వారు గతంలో చెల్లించిన గ్రాట్యుటీ రూ.4 లక్షల నుండి రూ.8 లక్షలకు పెంచిన‌ట్టు చెప్పారు. ఈ గ్రాట్యుటీ మొత్తాన్ని సదరు ఉద్యోగి బ్యాంకు ఖాతాలో ఏకకాంలో చెల్లిస్తామ‌న్నారు. ఎవ‌రైనా అకస్మాత్తుగా చ‌నిపోతే, అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం రూ.20,000/- ల నుండి రూ.30,000/- లకు పెంచిన‌ట్టు చెప్పారు. కాగా, ఈ అంశానికి సంబంధించి ప్రాంతీయ, జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు అర్చక, ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తారని మంత్రి వివరించారు. ఈ నిర్ణయంతో అర్చకులు, దేవాదాయ శాఖ ఉద్యోగులకు పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుందని మంత్రి కొండా సురేఖ ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story