ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొండా దంపతుల భేటీ

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొండా దంపతుల భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో మంత్రి కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. దీపావళి వేళ హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై సీఎం రేవంత్‌కు కొండా దంపతులు వివరిస్తున్నారు. వారితో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు.

కాగా, మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద కొన్ని రోజుల క్రితం హైడ్రామా చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) విషయంలో జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసం వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓఎస్డీ సుమంత్‌ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అతన్ని అరెస్ట్ చేసేందుకు మఫ్టీలో ఉన్న వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నలుగురు వ్యక్తులు మంత్రి నివాసం వద్దకు వెళ్లడంతో కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొండా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి తమ కుటుంబంపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీసీ మంత్రి అయిన తన తల్లి కొండా సురేఖను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని, రెడ్లందరూ కలిసి తమ ఫ్యామిలీని టార్గెట్ చేశారని విమర్శించారు. తాజాగా కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలపైనా కొండా దంపతులు సీఎం రేవంత్‌కు వివరణ ఇస్తున్నట్లు సమాచారం.

Next Story