నేను నిప్పు లాంటి వ్యక్తిని: మంత్రి కోమటిరెడ్డి

by Gantepaka Srikanth |

తెలంగాణ రోడ్ల అభివృద్ధి, హ్యామ్ (HAM) టెండర్ల చుట్టూ జరుగుతున్న రాజకీయ రచ్చపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

నేను నిప్పు లాంటి వ్యక్తిని: మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రోడ్ల అభివృద్ధి, హ్యామ్ (HAM) టెండర్ల చుట్టూ జరుగుతున్న రాజకీయ రచ్చపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనపై, ప్రభుత్వంపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అవినీతి ఆరోపణలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. ఈ సందర్భంగా తన వ్యక్తిత్వాన్ని, పనితీరును ఉద్దేశించి మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ అవినీతికి తావివ్వలేదని మంత్రి స్పష్టం చేశారు. "నేను నిప్పు లాంటి వ్యక్తిని. నా రాజకీయ జీవితంలో ఇప్పటివరకు నాపై ఎలాంటి అవినీతి మరకలు లేవు, కనీసం ఆరోపణలు కూడా లేవు. అలాంటిది నా శాఖపై బురద చల్లాలని చూడటం హాస్యాస్పదం" అని ఆయన మండిపడ్డారు.

వేములకు రోడ్ల గురించి ఏం తెలుసు?

మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ.. ఆయనకు రోడ్ల నిర్మాణం మరియు నిబంధనల గురించి అవగాహన లేదని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. "రోడ్ల గురించి, టెండర్ల ప్రక్రియ గురించి వేముల ప్రశాంత్ రెడ్డికి కనీస జ్ఞానం లేదు. గత పదేళ్లలో రాష్ట్రంలో రోడ్లను అధ్వాన్నంగా మార్చిన వారు ఇప్పుడు మాపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది." అని ఎద్దేవా చేశారు.

హ్యామ్ (HAM) రోడ్లలో అవినీతి లేదు..

హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పద్ధతిలో చేపడుతున్న రోడ్డు పనుల్లో భారీ స్కామ్ జరుగుతుందన్న విమర్శలను ఆయన ఖండించారు. హ్యామ్ రోడ్ల టెండర్లలో ఎలాంటి అవినీతి జరగలేదని, అంతా పారదర్శకంగా జరుగుతోందని వివరించారు. ఈ టెండర్లన్నీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ (NHA) నిబంధనల ప్రకారమే ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story