పూటకో పార్టీ మారే వారిని గెలిపిస్తే మనకే నష్టం: మంత్రి కోమటిరెడ్డి

by Gantepaka Srikanth |

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

పూటకో పార్టీ మారే వారిని గెలిపిస్తే మనకే నష్టం: మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14, 15, 16,17, 3 డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇంకా మిగిలి ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డును పూర్తి చేయడంతో పాటు సమస్యలు లేని కాలనీలుగా తీర్చిదిద్దారని అన్నారు. డివిజన్లో ప్రతి కాలనీకి 24 గంటలు తాగునీరు వచ్చే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని మరోసారి మంత్రి స్పష్టం చేశారు.

పూటకో పార్టీ మారే వాళ్లను గెలిపించొద్దు

పూటకో పార్టీ మారే వాళ్లను, ఇతర పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకే నష్టం జరుగుతుందని అన్నారు. నల్లగొండలో మున్సిపల్ కార్పొరేషన్‌గా చేసుకున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయన్నారు. దీంతో మరిన్ని అభివృద్ధి పనులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో 2,200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అన్ని డివిజన్లో ఇచ్చిన హామీలన్నిటిని కచ్చితంగా అమలు చేస్తానని స్పష్టం చేశారు. నేను పేదోళ్ల మనిషిననీ, ఇచ్చిన మాట తప్పననీ పేర్కొన్నారు. నల్లగొండ అభివృద్ధి మన చేతుల్లోనే ఉందని, ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపించి మోసపోవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వారు డివిజన్లోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు వీలుంటుంది అన్నారు. ఇతర పార్టీకి చెందిన అభ్యర్థులు గెలిస్తే వారితో ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. చర్లపల్లి, ఆర్జాల బావి, పాతపల్లె, శేషమ్మ గూడెం గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్న వాటన్నింటినీ పరిష్కరించే బాధ్యత నాదేనని అన్నారు.

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రజలంతా చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడి పార్టీ అభ్యర్థుల గెలుపు రికార్డు స్థాయిలో ఉండాలని, అది ప్రజల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ప్రశాంతంగా ఉండాలన్న, అన్ని రంగాలలో అభివృద్ధి కావాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాశం రామ్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, 14వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బొజ్జ శంకర్, 15వ డివిజన్ అభ్యర్థి పెరిక నాగరాజు, 16వ డివిజన్ అభ్యర్థి పెరిక స్వాతి వినాయక రాజు(చిట్టి), 17వ డివిజన్ అభ్యర్థి జేరిపోతుల అశ్విని భాస్కర్ గౌడ్, 3వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గాలి వినోద, మాజీ కౌన్సిలర్ మందడి శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, పలువురు మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story