ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.10 వేల కోట్ల దోపిడీ జరిగింది.. మంత్రి కోమటిరెడ్డి మరో సంచలనం

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌(KCR)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) సంచలన ఆరోపణలు చేశారు.

ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.10 వేల కోట్ల దోపిడీ జరిగింది.. మంత్రి కోమటిరెడ్డి మరో సంచలనం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌(KCR)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్‌లో అదనపు బ్లాక్‌లకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్.. రూ. 10 వేల కోట్లు దోచుకుతిన్నారని సంచలన ఆరోపించారు. ధరణి పోర్టల్(Dharani Portal) ద్వారా వేల కోట్ల భూముల్ని ఆక్రమించుకున్నారని అన్నారు. మంత్రులు, అధికారుల ఫోన్‌లను ట్యాపింగ్ చేయించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. అభివృద్ధిని విస్మరించి అధికారాన్ని ఎంజాయ్ చేశారని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిందే నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థులు, నాయకులు అని చెప్పారు.

మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. తాను మంత్రి పదవి త్యాగం చేశాను.. పార్లమెంట్‌లో రాజగోపాల్ రెడ్డి ఫైట్ చేశారు. సొంత నేతలతో ఉత్తమ్, జానారెడ్డి వంటి నేతలు సైతం పోరాడారు అని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని.. కాంగ్రెస్ పాలిట విలన్ అని కేసీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే.. తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. అందరి పోరాటంతో రాష్ట్రం వచ్చిందని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత కుటుంబసమేతంగా వెళ్లి కేసీఆర్ సోనియా గాంధీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారని.. సోనియా గాంధీని దేవత అన్నారని తెలిపారు. స్వయంగా నిండు అసెంబ్లీలో సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని అన్నారనీ గుర్తుచేశారు.

ఇప్పుడు అధికారం పోయేసరికి తట్టుకోలేక.. మరోసారి కాంగ్రెస్‌పై అసత్యం ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాల మీద ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు.. మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు.. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని మంత్రి కోమటిరెడ్డి రెచ్చిపోయారు. తాము అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరే అవుతుందని.. ఈ ఏడాదిన్నరలోనే ఎంతో పనిచేశామని అన్నారు. 50 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం, రైతుభరోసా ఇచ్చా, రుణమాఫీ చేశాం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం కల్పించాం, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని అన్నారు. తాము ఏడాదిన్నరలో చేసిన దాంట్లో.. బీఆర్ఎస్ 20 శాతం కూడా చేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Next Story