దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా.. ‘మున్సిపల్’ ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కంచుకోట అని, ఈనెల 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా.. ‘మున్సిపల్’ ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన
X

దిశ, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కంచుకోట అని, ఈనెల 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం నల్లగొండ నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్పోరేట్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ. 2,200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు వేగంగా ప్రగతి పథంలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మున్సిపల్ కార్పొరేషన్‌ను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

సూపర్ స్మార్ట్ సిటీ చేస్తా

నల్లగొండలో ప్రభుత్వ నిధులతో పాటు తన కుమారుడు ప్రతిక్ రెడ్డి జ్ఞాపకార్థం ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రూ. 8.50 కోట్లతో కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ బొట్టుగూడ ఉన్నత పాఠశాలను కార్పొరేటర్ స్థాయికి మించి నిర్మించి అదే స్థాయిలో సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు. తనను ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన ఇక్కడి ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదని తెలిపారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను సూపర్ స్మార్ట్ సిటీగా చేయడమే తన ధ్యేయమని తెలిపారు. ఈ ఎన్నికలలో ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే పేద ప్రజలకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని స్పష్టం చేశారు.

దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని 8వ వార్డును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. 11వ డివిజన్లోని మామిళ్ళగూడెంలో 3 నెలల్లోనే సీసీ రోడ్డును పూర్తి చేయిస్తానని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లో ప్లాట్ ఉన్న పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అన్ని డివిజన్లో మిగిలి ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని పేర్కొన్నారు. పేద ప్రజలకు ఏ సమస్య ఉన్న మీ కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని అన్నారు. ఈనెల 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ప్రచారంలో పార్టీ నేతలు, కార్పోరేటర్ అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story