TG: దక్షిణాది రాష్ట్రాలకు సెంటర్ పాయింట్‌గా హైదరాబాద్

by Gantepaka Srikanth |

భారత్ ఫ్యూచర్ సిటీ కేంద్రంగా హైస్పీడ్ రైల్ కారిడార్ హబ్ ఏర్పాటుతో ఇక హైదరాబాద్ దక్షిణాది రాష్ట్రాలకు సెంటర్ పాయింట్ అవుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

TG: దక్షిణాది రాష్ట్రాలకు సెంటర్ పాయింట్‌గా హైదరాబాద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్ ఫ్యూచర్ సిటీ కేంద్రంగా హైస్పీడ్ రైల్ కారిడార్ హబ్ ఏర్పాటుతో ఇక హైదరాబాద్ దక్షిణాది రాష్ట్రాలకు సెంటర్ పాయింట్ అవుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేస్తుందని వెల్లడించారు. హై స్పీడ్ రైల్వే కారిడార్లపై సోమవారం సెక్రటేరియట్‌లో ఆయన కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలు వ్యూహాత్మక కారిడార్ల పురోగతిని సమగ్రంగా పరిశీలించారు. ఈ సమావేశంలో నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ అధికారి ఇందుధర శాస్త్రి, సిపిఎం ముంబై యు.పి సింహా, రజనీష్ సరోజ్, ఆర్ అండ్ బి స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి ప్రావీణ్య, ఈఎన్సీలు మోహన్ నాయక్, జయభారతి, సీఈ వనజతో పాటు పలువురు సీఈలు, రైల్వే అధికారులు, ఎన్.హెచ్.ఎస్.ఆర్. సీ.ఎల్, హెచ్ఎండీఏ రవీందర్ రెడ్డి, ఎంఏయూడీ, హెచ్ఎంఆర్ఎల్ సిపిఎం ఆనంద్ మోహన్ పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్ రవాణాకు కీలకమైన హై స్పీడ్ కారిడార్లుగా పుణె-ముంబయి-హైదరాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ-బెంగళూరు, భారత్ ఫ్యూచర్ సిటీ-అమరావతి-చెన్నై కారిడార్లు మారబోతున్నాయన్నారు.

పుణె-ముంబయి-హైదరాబాద్ కారిడార్ పనులు వేగవంతం చేయాలి...

ఇప్పటికే డీపీఆర్ పూర్తయిన హైదరాబాద్-పూణే- ముంబై హై స్పీడ్ రైల్వే కారిడార్‌పై అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను మంత్రి సమగ్రంగా పరిశీలించారు. ప్రాజెక్ట్ అమలు దశలను వేగవంతం చేయాలని సూచించారు. మొత్తం 761 కి.మీ గల హైదరాబాద్ - ముంబై కారిడార్ లో మొత్తం 12 స్టేషన్లు... అందులో 10 ఎలివేటెడ్, 2 అండర్ గ్రౌండ్ ఉండనున్నాయని తెలిపారు. వికారాబాద్ దగ్గర 4.6 కి.మీ టన్నెల్ నిర్మించే అంశంపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని మంత్రి అధికారులతో అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నాన్ స్టాప్ గా 2 గంటల 55 నిమిషాల్లో ముబై చేరొచ్చని అధికారులు వివరించారు. 12 స్టేషన్లలో ఆగితే గంటకు 330కి. మీ స్పీడ్ తో 3గంటల 21నిమిషాల్లో గమ్యస్థానం చేరుకునేలా ప్లాన్ చేసినట్టు తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ- అమరావతి- చెన్నై కారిడార్ పై ప్రత్యేకంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సముఖంగా ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, పలువురు అధికారులు ఈ ప్రాజెక్టులో సమన్వయం చేసుకోవాలని సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీ- బెంగళూరు కారిడార్ లో మన్ననూర్ సోమశిల ప్రాంతాలను కలుపుతూ కారిడార్ డిజైన్ ను PPT ద్వారా మంత్రికి అధికారులు వివరించారు. ఈ కారిడార్లు రాష్ట్ర ఎకనమిక్ గ్రోత్ కారిడార్లు గా అభివర్ణించిన మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన కీలక చర్యలపై చర్చిస్తామని తెలిపారు.

జూన్ 2న టిమ్స్ సనత్ నగర్ ప్రారంభం

హై స్పీడ్ రైల్వేతో పాటు రాష్ట్రంలో కొనసాగుతున్న రోడ్లు, వంతెనలు, ఆరోఓబీలు, హైకోర్టు భవనం, టిమ్స్ హాస్పిటల్స్ పనుల పురోగతిపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు. పనులు సమయానికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లు మంత్రి వెల్లడించారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేలా టిమ్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను స్పష్టంగా ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పనుల పురోగతిని తెలుసుకుని,రిపోర్ట్ తయారు చేయాలని స్పెషల్ సెక్రెటరీకి మంత్రి సూచించారు. వరంగల్ హాస్పిటల్ పనులపై ఆరా తీసిన మంత్రి పనుల పురోగతిపై అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story