సంక్రాంతి వేళ టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీ ఉండొద్దు.. మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు

by Prasad Jukanti |

సంక్రాంతి పండగ రోజుల్లో రహదారులపై ట్రాఫిక్ రద్దీ విషయంలో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు.

సంక్రాంతి వేళ టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీ ఉండొద్దు.. మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంక్రాంతి సమయంలో రహదారులపై రద్దీ నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. రహదారిపై రద్దీ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఇవాళ మంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. సంక్రాంతికి వెళ్లేవారికి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారని చెప్పారు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని వాహనాల రద్దీపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి వాహనాల రద్దీ ఎక్కువ ఉంటుందని, ఎల్బీనగర్ నుంచి రామోజీ ఫల్మ్ సిటీ వరకు రద్దీ ఎక్కువగా ఉంటుందని జాతీయ రహదారిపై వాహనాలు ఆగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పండుగ రద్దీ ఉన్న రోజుల్లో భారీ యంత్రాలతో జరిగే పనులు నిలిపివేయాలని, అత్యవసరంగా చేయాల్సిన పనులు రాత్రి వేళల్లో మాత్రమే చేయాలని ఆదేశించారు. అన్ని రహదారుల లేన్లు వాహనాల రాకపోకలకు అందుబాటులో ఉంచాలని రోడ్డు పనులు జరుగుతున్న ప్రతి చోట ట్రాఫిక్ బోర్డులు పెట్టాలన్నారు. ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణ అంశాల్లో సమన్వయం పాటించాలన్నారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా వెళ్లేలా అదనపు బృందాలు మోహరించాలని సూచించారు. రేపు నేను తూప్రాన్ పేట్, అబ్దుల్లాపూర్‍మెట్ ప్రాంతాల్లో పర్యటిస్తానన్నారు.

ఇదిలా ఉండగా సంక్రాంతి టోల్ భారం సర్కారే భరించాలనే యోచనలో ఉన్నట్లు మీడియాలో కథనాలు రావడం హాట్ టాపిక్ అవుతోంది. పండక్కి ఊర్లకెళ్లే వాహన టోల్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని ఈ మేరకు అనుమతి కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయబోతోందనే కథనం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. అయితే ఈ కథనంపై పలువురు నెటిజన్లు విమర్శలు సైతం గుప్పిస్తున్నారు. తెలంగాణలో అత్యధిక మంది జరుపుకునే దసరా పండగ పూట లేని వినహాయింపు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా జరుపుకునే సంక్రాంతికి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఈ టోల్ మినహాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లబోతోందని అనేది సస్పెన్స్ గా మారింది.

Next Story