సమాజ చైతన్యంలో కవులు, క‌ళాకారుల‌ పాత్ర కీలకం: మంత్రి జూపల్లి

by Ajay Maddhiboyina |

సమాజ చైతన్యంలో కవులు, కళాకారుల పాత్ర చాలా ముఖ్యమైందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

సమాజ చైతన్యంలో కవులు, క‌ళాకారుల‌ పాత్ర కీలకం: మంత్రి జూపల్లి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సమాజ చైతన్యంలో కవులు, కళాకారుల పాత్ర చాలా ముఖ్యమైందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వాతంత్రోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, అలాగే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తల పాత్ర అమోఘమని ప్రశంసించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వారు ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు.

మన తెలుగు సాహిత్యానికి గొప్ప చరిత్ర ఉందని, నన్నయ, తిక్కన, ఎర్రప్రగడ నుంచి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆ తర్వాత దాశరథి, కాళోజీ వంటి కవుల రచనలు ప్రజలను చైతన్యపరిచాయని మంత్రి తెలిపారు. ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు కవులు, పండితులు, రచయితల ద్వారా సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు. వారి సృజనాత్మకతను ఉపయోగించి సమాజ మార్పు కోసం కృషి చేయడం అభినందనీయం అన్నారు.

యువతలో పెరుగుతున్న సామాజిక రుగ్మతలు:

నేటి సమాజాన్ని పట్టిపీడిస్తున్న సామాజిక రుగ్మతలు, యువతలో పెరుగుతున్న పెడధోరణుల పట్ల మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను రేపటి పౌరులుగా గురువులు తీర్చిదిద్దినట్లే, సమాజాన్ని తట్టిలేపే శక్తి కవులు, కళాకారులకే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ సమాజంలో ఒక సామాజిక చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత కవులు, రచయితలు, సాహితీవేత్తలు, మేధావులు, కళాకారులపై ఉందని అన్నారు. కవులు తమ రచనల ద్వారా సమాజంలో చైతన్యస్ఫూర్తిని నింపుతూ సమాజ ఉన్నతికి కృషి చేయాలని కోరారు.

కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది:

అంతేకాకుండా, రచయితలు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సలహాలు, సూచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల వద్దకు సాహిత్యాన్ని తీసుకెళ్లడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పుస్తకాలను గ్రామగ్రామాన చేరవేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, నెల్లుట్ల రమాదేవి, ఇతర కవులు, సాంస్కృతిక శాఖ సలహామండలి సభ్యులు పాల్గొన్నారు.

Next Story