భారీ వర్షాలు.. క"న్నీట" రైతులు.. శుభవార్త చెప్పిన మంత్రి

by Muthe.Rajitha |   (  Updated:2025-08-19 15:40:18  IST  )

తెలంగాణలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

భారీ వర్షాలు.. కన్నీట రైతులు.. శుభవార్త చెప్పిన మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. ఈ వర్షాల ధాటికి ప్రాజెక్టులు అన్నీ నిండిపోగా, నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఖరీఫ్ నాట్ల సీజన్ జోరందుకోగా.. ఈ వానల దెబ్బకు వరి పొలాలు అన్నీ చెరువులను తలపిస్తూ, వేసిన నాట్లన్నీ కొట్టుకు పోయాయి. అలాగే పత్తి, మొక్కజొన్న, మిరప, సోయాబీన్ పంటలన్నీ నీట మునిగి మొక్కలు కుళ్లిపోయాయి. దీంతో రైతులు తీవ్ర వేదనలో మునిగిపోయారు. పెట్టిన పెట్టుబడులు, తెచ్చిన అప్పులన్నీ నీటి పాలయ్యాయని దుఃఖిస్తున్నారు.

అయితే ఈ భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శుభవార్త తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్, మంత్రి అయిన జూపల్లి నేడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. పలు చోట్ల రైతులు కన్నీరు మున్నీరు అవగా, మంత్రి వారిని ఓదార్చే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో పంట నష్టపోయిన అన్నదాతలకు ఎకరాకు రూ.10 వేల పంట నష్టపరిహారం అందిస్తామని జూపల్లి ప్రకటించారు. మంత్రి ప్రకటనపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story