- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిన్నిస్ బుక్‌లో నమోదయ్యేలా బతుకమ్మ వేడుకలు.. ఎల్బీస్టేడియంలో 63 అడుగుల బతుకమ్మ ఏర్పాటు.. ఎప్పుడంటే?
ఎల్బీస్టేడియంలో 10 వేల మందితో 63 అడుగుల ఎత్తున బతుకమ్మ పేర్చి గిన్నిస్‌బుక్‌లో ఎక్కే విధంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : (Bathukamma Festival) బతుకమ్మ పండుగను మరోసారి విశ్వ వ్యాప్తంగా చాటాలని ప్రభుత్వం సంకల్పించిందని దానిలో భాగంగా ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో 10 వేల మందితో 63 అడుగుల ఎత్తున బతుకమ్మ పేర్చి (Guinness Book) గిన్నిస్‌బుక్‌లో ఎక్కే విధంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీక అని అన్నారు. బతుకమ్మ వేడుకలు ఈనెల 21 తేదీ నుంచి 30 వరకు జరుపుతున్నామని, రాష్ట్ర మహిళలంతా పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ స్ఫూర్తిని మరోసారి లోకానికి చాటాలని మంత్రి జూపల్లి విజ్ఞప్తి చేశారు. గురువారం గాంధీ భవన్‌లో బతుకమ్మ సంబరాలు నిర్వహణపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి జూపల్లితో పాటు టీపీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), మాజీ ఎంపీ వి.హన్మంతరావు నగర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను ఈ నెల 21న వరంగల్ వెయ్యి స్తంభాల గుడి దగ్గర ప్రారంభం కార్యక్రమం ఉంటుందని, ఈ నెల 22 నుంచి 26 వరకు ప్రతి రెండు జిల్లాల్లో ఒక రోజు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 27 నుంచి 30 వరకూ హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకలుంటాయని చెప్పారు. కవులను రచయితలను పిలిచి వారితో చర్చించి బతుకమ్మ పాటలు రాయిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు.
బతుకమ్మ జరిగే ప్రాంతాల్లో ప్రత్యేకంగా డెకరేషన్ ఏర్పాట్లు ఉంటాయని, అంతే కాకుండా విమానాశ్రయంలో కూడా మన సంస్కృతి తెలిసేలా ఏర్పాటు చేస్తున్నామని జూపల్లి తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు కూడా అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బతుకమ్మలు ఆడిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ వదిలేయకుండా బతుకమ్మలను నీళ్లలో కలిపే కార్యక్రమం చేయాలని మంత్రి జూపల్లి సూచించారు. తెలంగాణ సంప్రదాయం పద్దతుల్లో బతుకమ్మను పండుగను రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడం శభప్రదమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. బతుకమ్మ చీరల పంపిణీ త్వరలో జరుగబోతోందని, నాణ్యమైన చీరలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. బతుకమ్మ వేడుకలు జరిగే తొమ్మిది రోజులు కాంగ్రెస్ శ్రేణులు ఎంగిలి పువ్వు నుండి సద్దుల బతుకమ్మ వరకు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలని సూచించారు. సంప్రదాయ బద్దగా జరిగే బతుకమ్మ పండుగలో రకరకాల పాటలతో కాకుండా మన సంస్కృతిని ప్రతిభింబించే విధంగా రాజకీయాలకు అతీతంగా పండుగను నిర్వహించాలని మహేష్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున్న బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, బతుకమ్మ కుంట కోసం విహెచ్ఎంతో పోరాడారని, హైడ్రా సాయంతో బతుకమ్మకుంట ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిందన్నారు. బతుకమ్మ కుంటలో గతంలో మా మహిళా మణులు ఆడేవారని, బతుకమ్మ కుంట కబ్జాకు గురి అయింది, ఆ భూమి విషయంలో తనకు ఎన్నో ఆఫర్లు చేశారని ఆయన తాను వెనక్కి తగ్గలేదని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. బతుకమ్మ కుంటపై సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పగానే వెంటనే స్సందించి హైడ్రా సాయంతో బతుకమ్మ కుంటను కబ్జా నుంచి కాపాడారన్నారు. హైడ్రా ఎంతో వేగంగా బతుకమ్మ కుంటను ఎంతో అందంగా బతుకమ్మ కుంట తయారు చేశార్నారు. ఈనెల 25న అక్కడ పెద్ద ఎత్తున బతుకమ్మను వేడుకలు నిర్వహిస్తున్నామని హన్మంతరావు చెప్పారు. గతంలో బతుకమ్మ కుంట కబ్జా అయిన తర్వాత కేసీఆర్‌ను ఈ విషయంపై అడిగినా నిరుపయోగం అయిదని, వాళ్ల పార్టీ వారే కబ్జా చేశారని హన్మంతరావు ఆరోపించారు. దేశదేశాల్లో బతుకమ్మ ఆడిన కవితకు బతుకమ్మ కుంట కనిపించలేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, కాంగ్రెస్ నేతలు కైలాష్, ఇందిరా శోభన్, సరితా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






