మిల్లర్లకు సర్కారు మరోసారి వార్నింగ్.. బాయిల్డ్ రైస్‌పై ఫోకస్

by Disha Web Desk 2 |
మిల్లర్లకు సర్కారు మరోసారి వార్నింగ్.. బాయిల్డ్ రైస్‌పై ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం సేకరణలో మిల్లర్ల దోపిడీని అరికట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆరోపణలు చేస్తున్నారు. తేమ, తాలు, తరుగు పేరుతో మిల్లర్లు తీవ్ర ఇబ్బందులకు గరిచేస్తున్నారని వారు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లకు ఇదివరకే వార్నింగ్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని ప్రభుత్వం మరోమారు హెచ్చరించింది. మిల్లర్లు టార్గెట్ కంప్లీట్ చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది. గురువారం అంబేద్కర్ సచివాలయంలో మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో యాసంగి ధాన్యం సేకరణ, సీఎంఆర్ నూక శాతం ఇతరత్రా సమస్యలపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బందులు కలుగకూడదని, ధాన్యం సేకరణలో మిల్లర్లు ప్రభుత్వానికి ఖచ్చితంగా సహకరించాలని హెచ్చరించారు.

ఎఫ్ఏక్యూ ధాన్యంలో ఒక్క గింజ కోత పెట్టినా ఉపేక్షించమని అన్నారు. ధాన్యం అన్లోడింగ్‌లో వెంట వెంటనే ప్రాసెస్ పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎంఆర్ నిర్ణీత గడువులోగా ముగించాలన్నారు. యాసంగి ధాన్యంలో నూక శాతంపై గతంలో నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించిన నేపథ్యంలో ప్రస్తుత యాసంగి వరి రకాలు, పరిస్థితులకు ఎలా అన్వయించాలో త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయిస్తామని తెలిపారు. ప్రభుత్వంతో పాటు మిల్లర్లు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

మమ్మల్ని శతృవులుగా చూపడం బాధాకరం: మిల్లర్లు

ఈ సందర్భంగా మిల్లర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. తెలంగాణలో యాసంగి ఉష్ణోగ్రతలకు పొట్టదశలోనే గింజ విరిగిపోతుందన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ముడి బియ్యాన్ని ఇవ్వమని కోరడం వల్ల రైతులతో పాటు మిల్లింగ్ ఇండస్ట్రీ ఇబ్బందుల పాలవుతుందని చెప్పారు. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయంలో మిల్లర్లు సైతం భాగస్వాములమని, రైతు పండించిన పంట వినియోగదారునికి చేర్చే గురుతర బాధ్యతను మోస్తున్నామన్న మిల్లర్లు, తమను రైతులకు శతృవులుగా ప్రచారం చేయడం బాధ కలిగిస్తుందన్నారు.

ఎఫ్ఏక్యూతో ఉన్న ధాన్యంలో కోతలు పెట్టడం లేదన్న మిల్లర్లు ప్రస్తుత యాసంగిలో అకాల వర్షాలతో వచ్చిన ధాన్యం ముక్కడంతో పాటు రంగుమారుతుందని, దీనికి తోడు ముడిబియ్యంగా సగం ఔటర్న్ కూడా రాదని, ప్రభుత్వం త్వరితంగా నూక శాతాన్ని తేల్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్, జీఎం శ్రీనివాసరావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంపా నాగేందర్, జనరల్ సెక్రటరీ ఏ.సుధాకర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి. ప్రభాకర్ రావు, ట్రెజరర్ చంద్రపాల్, అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.


Next Story