రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమి సేకరణ పనులు పూర్తి చేయాలి

by Naga Rani Yarlagadda |

రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమి సేకరణ పనులు పూర్తి చేయాలని అధికారులకు రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు.

రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమి సేకరణ పనులు పూర్తి చేయాలి
X
  • భూసేకరణకు పరిహారంగా ఇచ్చే నిధులను సిద్ధం చేసుకోవాలి
  • రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

దిశ, తెలంగాణ బ్యూరో : రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమి సేకరణ పనులు పూర్తి చేయాలని అధికారులకు రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. మేడ్చల్​జిల్లా లోని బాచుపల్లి -గండిమైసమ్మ వరకు ఆరు వరసల రోడ్డుతో పాటు బహుదూర్ పల్లి నుంచి దూలపల్లి మీదుగా కొంపల్లి వరకు సాగే రహదారి నిర్మాణాలకు అటవీ భూమి బదలాయింపుపై రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం నాడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అటవీశాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ సువర్ణ, హెచ్ ఎండీఎ కమిషనర్ సర్ఫరాజ్ నవాజ్, జిహెచ్ ఎంసీ అదనపు కమిషనర్, కొంపల్లి మున్సిపల్ కమిషనర్, మేడ్చల్​జిల్లా అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ భూమి, ఫారెస్టేతర స్థలాల భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీధర్ బాబు ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ పనులకు శంకుస్థాపన జరిగే విధంగా యుద్ధ ప్రాతిపదికన నిర్దేశించిన పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు.

అటవీశాఖకు చెందిన 19 ఎకరాల భూమి అప్పగింతకు సంబంధించి మొదటి దశ ఫార్మాలిటీస్​అన్నీ గడువులోగా అయ్యేలా చూడాలని ఆదేశించారు. స్థానికులకు చెందిన భూ సేకరణ, నష్ట పరిహారం చెల్లింపులో మానవతా ధృక్పథంతో వ్యవహరించాలన్నారు. భూసేకరణకు పరిహారంగా ఇచ్చే నిధులను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే 8 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ముఖ్యంగా బహదూర్ పల్లి నుంచి కొంపల్లి రోడ్డులో అటవీ భూమి బదలాయింపునకు సంబంధించి స్టేజ్-1 ప్రక్రియ పూర్తయిందని ఫారెస్ట్ అధికారులు మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. బాచుపల్లి గండిమైసమ్మ రోడ్డు నిర్మాణానికి అవసరమైన అటవీ భూమి ట్రాన్సఫర్ పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. సుభాష్ నగర్ పైపు లైన్, సెంట్​యాన్స్ స్కూల్ రోడ్డు నిర్మాణం పనులను కూడా పూర్తి చేయాలని రెవిన్యూ, మున్సిపల్ అధికారులను శ్రీధర్ బాబు ఆదేశించారు.

Next Story