- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెక్స్‌టైల్ పెట్టుబడులకు తెలంగాణ సిద్ధం.. తిరుపూరు పారిశ్రామిక వేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో దుస్తుల (అప్పెరల్) పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దుస్తుల తయారీ పరిశ్రమల యాజమాన్యాలను ఆహ్వానించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో దుస్తుల (అప్పెరల్) పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Duddilla Sridhar Babu) తమిళనాడులోని తిరుపూరు దుస్తుల తయారీ పరిశ్రమల యాజమాన్యాలను ఆహ్వానించారు. ఇక్కడి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో వస్త్ర పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రపంచ స్థాయి మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మంగళవారం మంత్రి తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుపూరులను సందర్శించిన సందర్భంగా అక్కడి పారిశ్రామిక వర్గాలు, ఎగుమతిదారులతో మాట్లాడారు. అతిపెద్ద అప్పెరల్ తయారీ కేంద్రంగా తిరుపూరు గ్లోబల్ లీడర్ గా ఎదిగింది ఆయన అన్నారు. 10 వేల దుస్తుల పరిశ్రమలతో ‘నిట్ వేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ’గా తిరుపూరు లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని ప్రశంసించారు. దేశంలోని 90 శాతం దుస్తులు, క్యాజువల్ వేర్, స్పోర్ట్స్ వేర్, సాక్సులు, టోపీల లాంటివి కాటన్ ఉత్పత్తులు తిరుపూరు నుంచే ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. 1990 నుంచి తిరుపూరు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన దుస్తులను ఎగుమతి చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాణ్యతతో కూడిన రెడీమేడ్ తయారీకి అవసరమయ్యే లాంగ్ స్టేపుల్ (పొడవు పోగుల) కాటన్ తెలంగాణాలో సమృద్ధిగా అందుబాటులో ఉందని శ్రీధర్ బాబు వివరించారు.
రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలి
తెలంగాణా వ్యవసాయ, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) అధ్యక్షతన ఏర్పాటు చేసే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా వారిని కోరారు. త్వరలో దీనికి సంబంధించిన సమాచారం అందజేస్తామని తెలిపారు. అందరితో చర్చించిన తర్వాత తెలంగాణా నూతన టెక్స్ టైల్స్ పాలసీని రూపొందిస్తామని వెల్లడించారు. అమెరికా విధించిన 50 శాతం సుంకాల నేపథ్యంలో ఎగుమతులు దెబ్బతిన్నాయని, ఈ సమయంలో వస్త్ర పరిశ్రమ చేపట్టాల్సిన కార్యాచరణపైన కూడా చర్చించవచ్చని శ్రీధర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన హీరో ఫ్యాషన్ గ్రూప్ (రామ్ రాజ్ కాటన్స్) ఛైర్మన్ కెఆర్ నాగరాజన్, ఎండీ సుందరమూర్తిలను ప్రత్యేకంగా కలిశారు. సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ (సిమా) సెక్రటరీ జనరల్ కె. సెల్వరాజ్, సంస్థ సభ్యులను తెలంగాణాలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. సులభతర పారిశ్రామిక విధానాల అమలుతో తమ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఎగుమతి దారులతో ప్రత్యేక సమావేశం
తిరుపూరు ఎగుమతిదారుల సంఘం గౌరవ ఛైర్మన్ డా.ఎ. శక్తివేల్, అధ్యక్షుడు కెఎం.సుబ్రమణియన్, కార్యవర్గ సభ్యులు తితుకుమరన్, కుమార్ దొరైస్వామి, సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ కు చెందిన కె. సెల్వరాజ్, గోపి కుమార్ (చంద్ర గ్రూప్), ప్రతినిధి ఎం. ప్రభు దామోదరన్(ఇండియన్ టెక్స్ ప్రెన్యూర్స్ ఫెడరేషన్ - కోయంబత్తూరు) లతో శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. పెట్టుబడులతో వస్తే వారికి కావాల్సిన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు తిరుపూరులోని నేతాజీ అప్పెరల్ పార్కును సందర్శించి ఇండస్ట్రీ ప్రతినిధులతో మాట్లాడారు. పర్యటనలో టీజీఐఐసీ ఎండీ శశాంక, తెలంగాణా టెక్స్ టైల్స్, అప్పెరల్ (KMTP)విభాగం డైరెక్టర్ ధరణి కుమార్ కోగంటి తదితరులు పాల్గొన్నారు.






