- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌కి రావాల్సిన బాధ తప్పింది..! జిల్లాల్లోనే క్యాన్సర్ స్క్రీనింగ్ & చికిత్స కేంద్రాలు ప్రారంభం
రాష్ట్రంలో పెరిగిపోతున్న క్యాన్సర్ మహమ్మారిని ముందుగానే గుర్తించి అరికట్టడంతో పాటు వ్యాధి బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పెరిగిపోతున్న (Cancer) క్యాన్సర్ మహమ్మారిని ముందుగానే గుర్తించి అరికట్టడంతో పాటు వ్యాధి బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతోంది. క్యాన్సర్ మహమ్మారితో పోరులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం, రోగులకు జిల్లాల్లోనే చికిత్స అందించాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ (Cancer screening centers) క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (minister damodar raja narasimha) లాంఛనంగా ఈ సెంటర్‌ను ప్రారంభిస్తారు. క్యాన్సర్ స్క్రీనింగ్ తోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి జీవిత చరమాంకంలో స్వాంతన చేకూరుస్తూ చికిత్స అందించే పాలియేటివ్ కేర్ సెంటర్ ను సైతం సంగారెడ్డిలో మంత్రి ప్రారంభిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్క్రీనింగ్ సెంటర్లతో క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సకు అత్భుతమైన అవకాశంగా వైద్య నిపుణులు భావిస్తున్నారు.
క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ల ఏర్పాటుతో..
రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ సేవలు సులభంగా అందుబాటులో ఉండేలా చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మంగా మారనుంది. ఇన్నాళ్లు క్యాన్సర్ అనగానే నగరానికి పరిగెత్తుకు వచ్చే పరిస్థితి ఇకపై ఉండకుండా చూసేందుకు సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాల్లోనే ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవకాశం ఉండటం వల్ల గతంలో కనీసం పరీక్షలు చేసుకునేందుకు అవకాశం లేని పరిస్థితి నుంచి ఇప్పుడు గొప్ప మార్పు రానుంది. చికిత్సతో పాటు ఉచితంగా మందులు కూడా అందిస్తూ క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయడం గొప్ప పరిణామమని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్య సదుపాయాలను పెంచడం ద్వారా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సర్కారు చేస్తున్న ప్రయత్నాన్ని కొనియాడుతున్నారు.
జిల్లాల్లోనే క్యాన్సర్ చికిత్సకు అవకాశం..
ప్రతి ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్‌లో 10 క్యాన్సర్ డే కేర్ బెడ్లు, 10 పాలియేటివ్ కేర్ బెడ్లు ఏర్పాటు చేశారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఉన్న ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ (MNJ Oncology Institute) ద్వారా మొదటి డోస్ కీమోథెరపీ అందిస్తారు. అనంతరం క్యాన్సర్ రోగులు తమ తమ జిల్లా కేంద్రంలోనే చికిత్స పొందేలా వారికి అవకాశం కల్పిస్తారు. మందులను ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి సరఫరా చేస్తారు. అవసరమైతే ఎమ్‌ఎన్‌జె స్పెషలిస్టులు జిల్లాల క్యాన్సర్ కేర్ సెంటర్లలో రోగులను చూసి చికిత్స అందిస్తారు.ఆరోగ్యశ్రీ హెల్త్ స్కీమ్‌లో క్యాన్సర్, ప్యాలియేటివ్ చికిత్సకు అనుమతులు ఉండటం వల్ల రోగులు చేతి నుంచి పైసా ఖర్చు చేయకుండా ఉచితంగానే వైద్య సేవలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఫ్యాకల్టీ, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది, అవసరమైన స్టాఫ్, డ్రగ్స్ డిస్పోజబుల్స్, ఫ్రిజ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. వీరికి ఎంఎన్ జేలో ప్రత్యేక శిక్షణ అందించారు. ఎయిమ్స్, నిమ్స్, తదితర ముఖ్యమైన హాస్పిటల్స్ నుంచి కూడా ఆయా జిల్లాలకు సంబంధించిన క్యాన్సర్ కేసుల వివరాలు తీసుకుని వారికి సైతం స్థానికంగా క్యాన్సర్ చికిత్స అందించేలా వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.
ప్యాలియేటివ్ కేర్ సెంటర్‌లు..
పూర్తిగా నయం కానీ దీర్ఘకాలిక వ్యాధులతో (ఉదా: క్యాన్సర్, చివరి దశలోని హృద్రోగ, కాలేయ, కిడ్నీ వ్యాధులు) బాధపడే రోగులకు బాధను తగ్గిస్తూ చికిత్స అందిస్తూ జీవిత చరమాంకంలో వారికి అండగా ఉండే ఈ ప్యాలియేటివ్ కేర్ సెంటర్లు జిల్లాల్లోనూ ప్రారంభిస్తున్నారు. 10 ప్రత్యేక బెడ్లు, ప్రత్యేకంగా అనస్తీషియా ఫ్యాకల్టీ, సిబ్బంది పనిచేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కేవలం 14 శాతం మాత్రమే పాలియేటివ్ కేర్ చికిత్స అందుబాటులో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్‌లు (GGH) ఈ సేవలను అందిస్తాయి.
హైదరాబాద్ రావాల్సిన బాధ తప్పుతుంది..
కొత్తగా ఏర్పాటు చేసే డే కేర్ సెంటర్ల వల్ల ఇకపై జిల్లాల్లోనే క్యాన్సర్ స్క్రీనింగ్, కీమోథెరపీ, ప్యాలియేటివ్ కేర్ సేవలు అందుబాటులోకి వస్తాయి. రోగులు తక్కువ సమయంలోనే చికిత్స పొంది, అదే రోజున ఇంటికి వెళ్లొచ్చు. రాష్ట్రంలో ఇటీవల పెద్ద ఎత్తున పెరుగుతున్న క్యాన్సర్ కేసులకు తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందించే లక్ష్యంగా ప్రభుత్వం ఈ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. సమీపంలోనే వైద్య సేవలు అందించడం వల్ల క్యాన్సర్ రోగులు హైదరాబాద్‌కి రావాల్సిన అవసరం తగ్గుతుంది. రోగితో పాటు కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక ఇబ్బందులు తగ్గడంతో పాటు హాస్పిటల్ కోసం వెళ్లాల్సిన బాధ తప్పుతుంది. వయోభారంతో వచ్చే డిజెనరేటివ్ వ్యాధులకు కూడా పాలియేటివ్ కేర్ లో ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందిస్తారు. రోగులు చివరి దశల్లో కూడా గౌరవంగా, సాంత్వనతో జీవించేందుకు ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. ఈ సెంటర్లు ఏర్పాటు అవడం వల్ల, ‘జబ్బు నయం కాకపోయినా, రోగి జీవితం సులభతరం అవుతుంది’ అనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.






